|
|
by Suryaa Desk | Thu, Dec 11, 2025, 12:02 PM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో తొలి ఆర్నెల్లకు సంబంధించి సీఎం చంద్రబాబు సోమవారం విడుదల చేసిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ముందస్తు అంచనాలను తప్పులతడక అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ... తన మార్గదర్శకత్వంలో ఆర్థికంగా వృద్ధి చెందుతోందని ప్రజలను మభ్యపెట్టడానికే ఈ అంకెలను తయారుచేసినట్టుగా చంద్రబాబు చెప్పకనే చెప్పారంటూ దెప్పిపొడిచారు. దేశ ఆర్థిక పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, జీడీపీ పెరుగుదల సమానంగా ఉన్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఆదాయాలు, జీడీపీ పెరుగుదల సమానంగా ఉంటాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెబుతున్నట్లుగా రాష్ట్ర జీఎస్‌డీపీ సీఏజీఆర్ (సగటు వార్షిక వృద్ధి రేటు) 10.40 శాతంగా ఉన్నట్లయితే... రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదని, అది కేవలం 2.58 శాతానికే ఎందుకు పరిమితమైందని ప్రశ్నించారు.‘కొందరిని కొంతకాలంపాటు మభ్యపెట్టగలవు... కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయగలవు... కానీ, అందరినీ ఎల్లకాలం మభ్యపెట్టలేవు’ అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
Latest News