|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 10:27 AM
ఏపీలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారు జామున అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాటు రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్థానికుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా విఘ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందిన AP 39 UM 6543 నెంబర్ గల ప్రైవేట్ బస్సు 37మందితో భద్రాచలం నుంచి అరకు వెళ్తుంది. మార్గం మధ్యలో మారేడుమిల్లి ఘాటురోడ్డు లోని రాజుగారి మెట్టు మలుపు దగ్గర అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.చిత్తూరులో మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఈ నెల ఆరవ తేదీ రాత్రి 9 గంటలకు 39 మందితో యాత్రకు బయలుదేరింది. చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఏర్పాటైంది. బస్సు ప్రమాదానికి ముందు భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో పదుల సంఖ్యలో మృతిచెందారు. బస్సులోని ప్రయాణికులను చిత్తూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
Latest News