|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:24 PM
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పాఠకులను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ అనుకూల పత్రిక కుతంత్రాలను కొనసాగిస్తూనే ఉందని వైయస్ఆర్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి గురువారం విమర్శించారు. అందుకోసం తనదైన శైలిలో వక్రీకరణకు, దుష్ప్రచారానికి తెగబడుతోందని పేర్కొన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా, అధికారికంగా ఉత్తర్వుల కాపీ అందకుండా.. సీబీఐ దర్యాప్తునకు పాక్షిక అనుమతి వార్తను ప్రచురిస్తూ, తప్పుడు సమయాన్ని ముద్రించి పాఠకులకు అనుమానాలు కలిగేలా చేయాలని కుట్ర పన్నిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును మరింత లోతైన దర్యాప్తునకు సీబీఐని ఆదేశించాలన్న సునీత పిటిషన్‌పై వెలువడిన పాక్షిక అనుమతి వార్తను ‘ఉత్తర్వుల కాపీ అందకుండానే’ వక్రీకరించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. అర్ధరాత్రి 1.42 గంటలకే హత్య వార్త మెసేజ్ కిరణ్ యాదవ్ మొబైల్ ఫోన్ నుంచి అర్జున్‌రెడ్డి మొబైల్ ఫోన్‌కు వెళ్లిందని పాఠకుల మనస్సుల్లో విషబీజాలు నాటేందుకు టీడీపీ అనుకూల మీడియా కథనాన్ని ప్రచురించిందన్నారు. యూనివర్సల్ టైమ్ కోఆర్డినేటెడ్(యూటీసీ) కాలమానానికి, భారతీయ కాలమానం అయిన ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్‌టీ)కి తేడా కూడా గుర్తించకుండా విష ప్రచారానికి పాల్పడుతుండడాన్ని శ్రీకాంత్‌రెడ్డి ఎండగట్టారు. ఈ అంశంపై దుష్ప్రచారాన్ని ఆయన మీడియాకు వివరించారు. ఈ హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి వైయస్ ప్రకాశ్ రెడ్డి మనవడు వైయస్ అర్జున్ రెడ్డి ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని సునీత తన పిటిషన్‌లో కోరారు. అదే విషయాన్ని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఉత్తర్వులు రాకముందే చంద్రబాబు అనుకూల మీడియా దుష్ప్రచారాన్ని షురూ చేసింది. సునీత తన పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు వక్రభాష్యం చెబుతూ చంద్రబాబు డైరెక్షన్‌లో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ఎల్లోమీడియా యత్నిస్తోందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.
Latest News