|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 12:29 PM
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పేదల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. అయన మాట్లాడుతూ... కూలి చేసుకుని పైసా పైసా కూడబెట్టుకుని ఇళ్లు నిర్మించుకున్నారన్న కనీస మానవత్వం లేకుండా ఈ ప్రభుత్వం విజయవాడ భవానిపురం జోజినగర్‌లో 42 ఇళ్లను కూల్చివేసింది. డిసెంబర్ 31 వరకు ఇళ్ల జోలికి వెళ్లవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా లెక్కచేయకుండా వందల సంఖ్యలో పోలీసులు వేకువజామున జోజినగర్ ప్రాంతానికి చేరుకుని సామాన్లు బయటకు తీసుకొచ్చే సమయం కూడా ఇవ్వకుండా నేలమట్టం చేశారు. దేశసర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తూ ప్రభుత్వమే దుర్మార్గంగా పేదలను ఇళ్లను నేలమట్టం చేసింది. ఈ ఇళ్ల విషయమై సాయం చేయాలని బాధితులు చాలాకాలం నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కేశినేని చిన్నిలకు, మంత్రి నారా లోకేష్ లను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. జనసేన పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. ఇప్పుడు వారంతా ఉండటానికి నిలువ నీడ లేక చలికి ఎండకీ చెట్ల కింద, టెంట్ కింద కుటుంబాలతో తలదాచుకుంటున్నారు. కొంతమంది ఈ ఇళ్లను కట్నం కింద అల్లుళ్లకి ఇచ్చిన పరిస్థితి. వారికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికారులు కూల్చేసిన 42 ఇళ్లకు 25 ఏళ్లుగా ఆస్తి పన్ను కడుతున్నారు. కరెంట్ బిల్లు చెల్లిస్తున్నారు. విజయవాడ ఉత్సవాలను పర్యవేక్షించడానికి తపనపడిన ఎంపీ కేశినేని చిన్ని కనీసం జోజినగర్ బాధితులను పరామర్శించిన పాపాన పోలేదు. పేదల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. జోజినగర్ వాసులకు జరిగిన అన్యాయంపై మా పార్టీ అధినేత వైయస్ జగన్ గారి ఆదేశాలతో ఇప్పటికే ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. మా పార్టీ కార్పొరేటర్లు కార్పొరేషన్‌లో ఈ విషయంపై గళమెత్తితే వారి మీద అధికార పార్టీ కార్పొరేటర్లు దాడికి దిగారు. బాధితుల వినతి మేరకు వారిని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని కలిపించడం జరిగింది. వారి కష్టాలను చూసిన జగన్ గారు.. ఎంతో చలించి పోయారు. ఇళ్లు కట్టించడం చేతకాని ప్రభుత్వం.. పేదలు కష్టంతో కట్టుకున్న ఇళ్లను కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోజినగర్ బాధితులు కోరిన విధంగా వారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
Latest News