|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:31 PM
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం ప్రకటించారు.వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన 37 మంది యాత్రికులు ఓ ప్రైవేటు బస్సులో భద్రాచలం దర్శనం ముగించుకుని అన్నవరం బయలుదేరారు. చింతూరు-నరెడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఓ ప్రమాదకరమైన మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయారు. దీంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న భద్రతా గోడను ఢీకొని లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు.ప్రమాదం జరిగిన ప్రాంతం మారుమూల అటవీ ప్రాంతం కావడంతో అక్కడ మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో సమాచారం అధికారులకు ఆలస్యంగా చేరింది. విషయం తెలుసుకున్న మోతుగూడెం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను వెలికితీసి, క్షతగాత్రులను ఐదు పోలీస్ వాహనాలు, మూడు అంబులెన్సుల సహాయంతో చింతూరులోని ఆసుపత్రికి తరలించారు.ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Latest News