|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 08:25 PM
కొవిడ్-19 మహమ్మారి సమయంలో ముందుండి పోరాడి ప్రాణాలు కోల్పోయిన వైద్యుల కోసం ప్రభుత్వం రూ.50 లక్షల బీమా పథకాన్ని తీసుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది ప్రభుత్వ వైద్యులకు మాత్రమే కాకుండా ప్రైవేటు వైద్యులు, ఆరోగ్య నిపుణులకు కూడా తప్పనిసరిగా వర్తిస్తుందని సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది.
బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన ధర్మాసనం
జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆర్. మహాదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ చారిత్రక తీర్పును వెలువరించింది. లాక్‌డౌన్ సమయంలో క్లినిక్ తెరిచి, కొవిడ్ సేవలు అందిస్తూ.. 2020 జూన్‌లో మరణించిన ప్రైవేట్ ప్రాక్టీషనర్ డాక్టర్ బి.ఎస్. సర్గాడే భార్య దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిగింది. అయితే డాక్టర్ సర్గాడే సేవలను ప్రభుత్వం అధికారికంగా 'రిక్విజేషన్' (విధుల్లోకి తీసుకోవడం) చేయలేదన్న కారణంతో ఆమె పిటిషన్‌ను బాంబే హైకోర్టు గతంలో కొట్టివేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. బాంబే హైకోర్టు తీర్పును తప్పుబట్టింది.
డాక్టర్లు, ఆరోగ్య నిపుణుల కుటుంబాలకు బీమా పథకాన్ని నిరాకరించడానికి.. అధికారిక నియామక పత్రాలు లేవనే చెప్పడం సరికాదని పేర్కొంది. మహమ్మారి విజృంభించిన సమయంలో.. అసాధారణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలే తప్ప, ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత నియామక పత్రాలు డిమాండ్ చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (PMGKY) కింద బీమాను ప్రారంభించడం, డిస్పెన్సరీలను తెరిచి ఉంచాలని మున్సిపల్ శాఖ ఆదేశాలు ఇవ్వడం ద్వారా డాక్టర్ల సేవలను కోరినట్లే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. ఈ పథకం ముందు వరుసలో ఉన్న వైద్య నిపుణులకు "దేశం మీతో ఉంది" అనే భరోసా ఇవ్వడానికి ఉద్దేశించబడింది అని కోర్టు వ్యాఖ్యానించింది.
మహమ్మారి సమయంలో ఎదురైన ఒత్తిడిని అంగీకరిస్తూ.. "మా డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు తగ్గని హీరోలుగా ఎదిగారు. సవాళ్లను ధైర్యంగా మార్చారు" అని కోర్టు కొనియాడింది. అయితే PMGKY కింద ప్రయోజనం పొందాలంటే.. మరణించిన వ్యక్తి కొవిడ్-19 సంబంధిత విధులు నిర్వహిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని నిరూపించడానికి విశ్వసనీయ ఆధారాలు సమర్పించాల్సిన బాధ్యత క్లెయిమ్‌ను దాఖలు చేసిన వారిపైనే ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత క్లెయిమ్‌ల విశ్వసనీయతను సంబంధిత కార్యాలయాలు లేదా ఏజెన్సీలు పరిశీలిస్తాయని వివరించింది.
Latest News