|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 09:45 AM
నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మాణం నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే, కూటమి పార్టీలు పాండిచ్చేరికి క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టడం చూస్తుంటే, అప్పుడే వైయస్ఆర్‌సీపీ నైతికంగా విజయం సాధించేసినట్టేనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరులో పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు మాకు 41 మంది కార్పొరేటర్ల బలం ఉందని చెప్పుకుంటూనే ఐదుగురు కార్పొరేటర్లు తిరిగి వైయస్ఆర్‌సీపీకి వస్తే వణికిపోతున్నారని, పోలీసులను పంపించి కార్పొరేటర్, వారి కుమారుడ్ని అరెస్ట్ చేయించి తిరుపతి తీసుకెళ్లిపోయారని చెప్పారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే కార్పొరేటర్లను కూటమి నాయకుల ఇళ్లకు డెలివరీ చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీకార్పొరేటర్ల భార్య, పిల్లలకు ఫోన్లు చేసి బూతులు తిడుతూ, గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్న టీడీపీ నాయకులు... 8 నెలల మేయర్ పదవి కోసం ఇంతలా దిగజారడం సిగ్గుచేటన్నారు. రూ. 10 కోట్ల వర్కులిస్తామన్నా కార్పొరేటర్లు టీడీపీలో ఉండటానికి ఇష్టపడటం లేదని, వారికి అక్కడ గౌరవం లేదని, పైగా ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను గుర్తించి వెనక్కి వచ్చేస్తున్నారని వివరించారు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నా మళ్లీ వైయస్ జగన్ గారు సీఎం కాబోతున్నారనే స్పష్టత ప్రజల్లో వచ్చిందని, దాన్ని గుర్తించారు కాబట్టే టీడీపీ నాయకుల్లో వణుకు మొదలైందని చెప్పారు. యానాదులను రాజకీయంగా ప్రోత్సహించాలని వైయస్ జగన్ గారు ఇచ్చిన పదవిని లాక్కోవడం తగదని టీడీపీ నాయకులకు హితవు పలికారు. దీంతోపాటు పల్నాడు జిల్లాలో వైయస్ఆర్‌సీపీని ఎదుర్కోలేకనే పిన్నెల్లి సోదరుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారన్న మాజీ మంత్రి, 30 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ ఆధిపత్య పోరుతో వారిలోవారే చంపుకున్న కేసులో పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించారని... వీటన్నింటికీ భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాను కూటమి ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి, రౌడీయిజానికి అడ్డాగా మార్చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.
Latest News