|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 11:06 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన కఠిన టారిఫ్‌ల విధానంపై సొంత దేశంలోనే వ్యతిరేకత పెరుగుతోంది. ఈ సుంకాలను సవాలు చేస్తూ ముగ్గురు ప్రతినిధుల సభ సభ్యులు నిన్న ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ అత్యవసర పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు విధించేలా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.డెమొక్రాటిక్ పార్టీకి చెందిన డెబోరా రాస్, మార్క్ వీసే, భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని సభ ముందుంచారు. ముఖ్యంగా ఆగస్టు 27, 2025న విధించిన అదనపు 25 శాతం సెకండరీ టారిఫ్‌లను ఇది లక్ష్యంగా చేసుకుంది. ఈ టారిఫ్‌లు చట్టవిరుద్ధమని, ఇవి అమెరికన్ వినియోగదారులు, వ్యాపారాలకే తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని వారు తమ తీర్మానంలో పేర్కొన్నారు.ఈ సుంకాల వల్ల తమ నార్త్ కరోలినా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని డెబోరా రాస్ ఆందోళన వ్యక్తం చేశారు. "భారత్‌తో మాకు బలమైన వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు ఉన్నాయి. ఈ టారిఫ్‌లు కీలక ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి" అని ఆమె అన్నారు. ఇవి సామాన్యులపై పన్నుల భారమని, ఇప్పటికే అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను మరింత కుంగదీస్తాయని మార్క్ వీసే విమర్శించారు.ఈ చర్యలు అమెరికా ప్రయోజనాలకు బదులుగా సరఫరా గొలుసులను దెబ్బతీసి, కార్మికులకు నష్టం కలిగిస్తున్నాయని రాజా కృష్ణమూర్తి తెలిపారు. ఈ టారిఫ్‌లను రద్దు చేయడం ద్వారానే అమెరికా-భారత్ ఆర్థిక, భద్రతా సంబంధాలు బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని, తద్వారా మాస్కో యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నాయని ఆరోపిస్తూ ట్రంప్ ఆగస్టు 1న తొలుత 25 శాతం, ఆ తర్వాత మరికొద్ది రోజులకే మరో 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు తన అత్యవసర అధికారాలను ఉపయోగించి వాణిజ్య అడ్డంకులు సృష్టించడాన్ని అడ్డుకునే విస్తృత ప్రయత్నాల్లో భాగంగానే ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్లు సభ్యులు తెలిపారు.
Latest News