|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:23 PM
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి విద్యార్థులకు జీవితానికి సంబంధించిన అమూల్యమైన పాఠాలు చెప్పారు. నిరంతరం నేర్చుకోవడమే నిజమైన యవ్వనమని, నైతిక విలువలే ఉన్నత స్థానానికి చేరుస్తాయని ఆమె ఉద్బోధించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం 'వేవ్స్ 2025'కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె, విద్యార్థులు, పూర్వ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా సుధామూర్తి మాట్లాడుతూ "నేర్చుకోవడం, ప్రశ్నించడం ఆపేసినప్పుడే మనిషికి వృద్ధాప్యం వస్తుంది. జీవితాంతం నేర్చుకోవడం ద్వారానే ఆనందం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ సొంత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, ఎవరి మారథాన్‌లో వారే పరుగెత్తాలి" అని సూచించారు. విజయం, వైఫల్యం జీవితంలో సర్వసాధారణమని, ఓటముల నుంచే పాఠాలు నేర్చుకొని గెలుపునకు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. "నిరంతర విజయాలు అహంకారాన్ని పెంచుతాయి. వేసే ప్రతి అడుగు ఒక అనుభవ పాఠం కావాలి. ఈరోజు వేదికపై ఉన్నవారంతా ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్నవారే" అని ఆమె అన్నారు.
Latest News