|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 06:49 PM
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనపై ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా తన అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇటీవల మెస్సీ పర్యటన జరిగిన తీరు తనను తీవ్రంగా బాధించిందని, ఎంతో అసౌకర్యంగా అనిపించిందని బింద్రా సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.మెస్సీ పర్యటన సందర్భంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టింది కేవలం ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనతో ఫొటోలు దిగేందుకేనా అని బింద్రా ప్రశ్నించాడు. ఈ డబ్బులో కొంత భాగాన్ని దేశంలో క్రీడల మౌలిక సదుపాయాల కల్పనకు, అట్టడుగు స్థాయి నుంచి యువ క్రీడాకారులను ప్రోత్సహించడానికి వెచ్చించి ఉంటే ఎంతో బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డాడు.మనం నిజంగా క్రీడా సంస్కృతిని నిర్మిస్తున్నామా లేక కేవలం విదేశీ దిగ్గజాలను దూరం నుంచి ఆరాధిస్తున్నామా అని ప్రశ్నించాడు.అయితే, తన విమర్శ మెస్సీకి ఎంతమాత్రం వ్యతిరేకం కాదని బింద్రా స్పష్టం చేశాడు. ఒక అథ్లెట్‌గా మెస్సీ పట్టుదల, వినయం, గొప్పదనాన్ని తాను ఎంతగానో గౌరవిస్తానని తెలిపాడు. తన ఆవేదన అంతా మన దేశంలో క్రీడల పట్ల ఉన్న దృక్పథం గురించేనని పేర్కొన్నాడు.మెస్సీ పర్యటన ప్రారంభంలోనే గందరగోళం నెలకొనడం, అభిమానులు అతడిని సరిగ్గా చూడలేకపోవడం వంటి సంఘటనలు వివాదానికి దారితీశాయి. ఆ తర్వాత హైదరాబాద్, ముంబైలలో కార్యక్రమాలు సజావుగా సాగినా, ప్రముఖులు మెస్సీతో ఫొటోలు దిగేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది. ఈ నేపథ్యంలోనే అభినవ్ బింద్రా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Latest News