|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 06:52 PM
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల బూత్ స్థాయి అధికారి విధుల నుంచి తప్పించాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. సచివాలయ ఉద్యోగులు అదనపు పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే 16 రకాల సర్వేలతో పాటు ఇతర పనులతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని ఈశ్వరయ్య తన లేఖలో పేర్కొన్నారు. ఈ పని భారానికి అదనంగా ఎన్నికల విధులు కూడా తోడవడంతో వారు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలల్లోనే పని ఒత్తిడి కారణంగా నలుగురు సచివాలయ ఉద్యోగులు మరణించడం అత్యంత బాధాకరమని ఆయన తెలిపారు.ఇదే సమయంలో కర్నూలు జిల్లాలో 600 మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు అధికారులు షోకాజు నోటీసులు జారీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సచివాలయ ఉద్యోగులపై పని భారం తగ్గించాలని, వారిని బీఎల్‌వో విధుల నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు.
Latest News