|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 07:51 PM
ఉప్పాడ తీర ప్రాంత సమస్యపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉప్పాడ తీర ప్రాంతంలోని మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త ఆలోచన చేశారు. ఇందుకోసం 100 రోజులు ప్రణాళిక ప్రకటించారు. ఈ ప్రణాళిక ప్రకారం ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు అధ్యయనం, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఉప్పాడ మత్స్యకారులకు తమిళనాడు. కేరళ రాష్ట్రాలలో ట్రైనింగ్ అందించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అనుసరిస్తున్న టెక్నాలజీ సాయంతో.. ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులకు వసతులు కల్పించేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే దానిపై మత్స్యశాఖ అధికారులు అధ్యయనం జరుపుతున్నారు.
అందులో భాగంగా మత్స్య సంపదతో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన అధునాతన పద్దతులపై అధ్యయనం చేసేందుకు ఉప్పాడ మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపించారు. డిసెంబర్ నెల 8వ తేదీన 60 మంది మత్స్యకారులు.. రెండు బృందాలుగా అక్కడకు వెళ్లారు. స్థిరమైన ఆర్ధికాభివృద్ధి సాధించడం ఎలా అనే అంశం మీద రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. అధునాతన కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, మార్కెటింగ్ వ్యవస్థల ఏర్పాటుపై శిక్షణ తీసుకున్నారు. అలాగే హార్బర్ల సందర్శన, హ్యాచరీల్లో చేపల గుడ్లు పొదిగించడం, వలల తయారీ తదితర అంశాల్లో వీరికి ట్రైనింగ్ ఇప్పించారు.
తమిళనాడుకు వెళ్లిన మత్స్యకారులకు.. చెన్నైలోని మండపం వద్ద ఉన్న సి.ఎస్.ఎం.సి.ఆర్.ఐలో కృత్రిమ, సహజ పద్దతుల్లో సాగు చేస్తున్న కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్ గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు. సముద్ర వనరుల దీర్ఘకాలిక సంరక్షణకు అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలను తెలియజేశారు. చేపల అమ్మకం, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ, మత్స్య సంపద గ్రేడింగ్, వేలం నిర్వహణ, వ్యర్ధాల నిర్వహణ, సప్లై చైన్ వంటి అత్యాధునిక సదుపాయాలపై అవగాహన కల్పించారు. ఇక కేరళ వెళ్లిన బృందానికి చేపలవేటలో సాంకేతిక మేళవింపు, స్థిరమైన ఆదాయార్జన, లాభదాయక విధానాలు అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ పర్యటనల ద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అమలు చేస్తున్న అధునాతన విధానాలు, లాభాలపై ఉప్పాడ మత్స్యకారులకు అవగాహన కలిగిందని అధికారులు చెప్తున్నారు.
Latest News