|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 12:37 PM
నకిలీ పాన్, ఆధార్ పత్రాలు ఉపయోగించి సృష్టిస్తున్న నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్దిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాదనం ఇచ్చారు. గత మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు వెలుగుచూశాయని, వీటి ద్వారా భారీగా పన్ను ఎగవేత జరిగిందని తన సమాధానంలో అంగీకరించారు. 2023–24లో 5,699 నకిలీ రిజిస్ట్రేషన్లు గుర్తించగా, దాదాపు రూ.15,085 కోట్ల పన్ను నష్టం జరిగినట్లు తెలిపింది. 2024–25లో 3,977 కేసుల్లో రూ.13,109 కోట్ల మేర పన్ను ఎగవేత జరిగినట్టు, 2025–26లో అక్టోబర్ వరకు 489 కేసుల్లో రూ.3,013 కోట్ల నష్టం జరిగినట్టు వెల్లడించింది.నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, ఫేక్ బిల్లింగ్, అనర్హ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవులు నిర్వహించినట్లు తెలిపారు. బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ, రిస్క్ ఆధారిత పరిశీలన, వ్యాపార స్థలాల జియో ట్యాగింగ్, బ్యాంక్ ఖాతాల అనుసంధానం వంటి చర్యలు తీసుకున్నామని వివరించారు.అలాగే నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారి జీఎస్టీ రిజిస్ట్రేషన్లను సస్పెండ్ చేయడం, రద్దు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారాల్లో ఇప్పటివరకు 133 మందిని అరెస్ట్ చేసి, 94 కేసుల్లో అభియోగాలు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం జరుగుతోందని, నిజాయితీగా పన్నులు చెల్లించే వ్యాపారులపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాలకు కఠిన శిక్షలు, వేగవంతమైన విచారణ, పన్ను నష్టం పూర్తిగా రికవరీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Latest News