|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 12:38 PM
ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం, రైతులు, విద్యార్ధులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిందని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. చివరకు పేద ప్రజలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న లక్ష్యంతో వైయస్.జగన్ హాయంలో నిర్మాణం ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలనూ పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కేవలం కమిషన్ల కోసమే... ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజల చేతిలో తగిన శాస్తి ఖాయమని హెచ్చరించారు. 18 నెలలుగా ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్ఆర్‌సీపీ... అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపైనా అనేక దశల్లో ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించిందని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటికి పైగా సంతకాలు సేకరించిన ఇప్పటికే వైయస్ఆర్‌సీపీ కార్యాలయానికి చేరాయని... వాటిని వైయస్.జగన్ నేతృత్వంలో ఈనెల 18న గౌరవ గవర్నర్ సమర్పిస్తామని స్పష్టం చేశారు.
Latest News