|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:24 PM
కూటమి ప్రభుత్వంపైనా, టీటీడీ ఛైర్మన్ పైనా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతిలో అత్యంత విలువైన రూ.3 వేల కోట్ల టీటీడీ భూమిని ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి కట్టబెట్టి, శ్రీ వేంకటేశ్వర స్వామికి తీరని ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. ఇది పరకామణి దొంగతనం కన్నా వంద రెట్లు పెద్దదని ఆరోపించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.వంద గదుల హోటల్ కోసం అలిపిరి రోడ్డులోని అత్యంత విలువైన భూమిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పర్యాటక శాఖ భూమికి బదులుగా టీటీడీ భూమిని బదిలీ చేయడమే కాకుండా, లీజును కూడా మాఫీ చేసి చంద్రబాబు ప్రైవేటు సంస్థకు దోచిపెట్టారని ఆరోపించారు. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ, అది ఈసీ (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్)లో కనిపించకుండా ఎందుకు దాస్తున్నారని భూమన నిలదీశారు. దీని వెనుక వేల కోట్ల అవినీతి దాగి ఉందని, చంద్రబాబు, పవన్ కలిసి ఈ భూమిని ప్రైవేటు సంస్థకు అప్పగించారని విమర్శించారు.టీటీడీ భూములను ప్రైవేటుపరం చేయడాన్ని స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన కోరారు. తిరుమల భక్తులను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News