|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 07:31 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్. ఏపీలో ఉపాది హామీ పథకం జాబ్ కార్డులు భారీగా రద్దయ్యాయి. 2025 -26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో సుమారుగా 18.38 లక్షల జాబ్ కార్డులు రద్దయ్యాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువగా జాబ్ కార్డులు రద్దు కావటం గమనార్హం. ఇక అక్టోబర్ 10 నుంచి నవంబర్ 14 మధ్య కాలంలో ఏపీలో 11.07 లక్షల జాబ్ కార్డులు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు. కేవలం ఐదు వారాల వ్యవధిలోనే 11 లక్షల జాబ్ కార్డులను అధికారులు ఉపాధి హామీ పథకం నుంచి తొలగించారు. ఈ ఐదు నెలల కాలంలో దేశవ్యాప్తంగా 16.31 లక్షల జాబ్ కార్డులు రద్దు కాగా.. అందులో 11 లక్షలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి కావటం గమనార్హం. దేశవ్యాప్తంగా రద్దు అయిన కార్డులలో 68 శాత ఏపీవే.
మరోవైపు ఈ ఐదు నెలల కాలంలో మిగతా రాష్ట్రాలలో కనీసం లక్ష జాబ్ కార్డులు కూడా రద్దు కాలేదు. కానీ ఏపీలో మాత్రం ఈ సంఖ్య 11 లక్షలుగా ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో 95,084, ఒడిశా 80,896, జమ్మూకశ్మీర్ 79,070 జాబ్ కార్డులు రద్దైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రూ. 7,707.21 కోట్లు విడుదల చేసింది.
మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటోంది. అందులో భాగంగా ప్రతి మూడు నెలలకు ఓసారి జాబ్ కార్డులపై సమీక్షిస్తుంటారు. కొత్త జాబ్ కార్డుల జారీతో పాటుగా చనిపోయినవారు. చాలా రోజుల నుంచి పనిచేయని వారు, వలస పోయినవారి జాబ్ కార్డులను తొలగిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో జాబ్ కార్డులకు ఈ కేవైసీ కూడా తప్పనిసరి చేయటంతో.. భారీగా జాబ్ కార్డులు రద్దైనట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లెక్కల ప్రకారం.. ఏపీలో 51 లక్షల కుటుంబాలు.. 90 లక్షలమంది కూలీలు ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్నారు.
Latest News