|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:56 PM
వైవాహిక బంధం విషయంలో భర్త బాధ్యతలపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెండో భార్యను పోషిస్తున్నాననే నెపంతో.. మొదటి భార్యకు చెల్లించాల్సిన భరణాన్ని నిరాకరించడం చట్టరీత్యా చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ హర్వీర్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. పిటిషనర్ మహమ్మద్ ఆసిఫ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
అసలీ కేసు ఏంటంటే?
మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తి తన మొదటి భార్యకు నెలకు రూ. 20,000 భరణం చెల్లించాలని అలీఘర్ ఫ్యామిలీ కోర్ట్ గతంలో ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఆసిఫ్ హైకోర్టును ఆశ్రయించాడు. తాను బెంగళూరులోని ఒక హార్డ్‌వేర్ షాపులో దినసరి కూలీగా పని చేస్తున్నానని.. తన వార్షిక ఆదాయం కేవలం రూ. 83,000 మాత్రమేనని కోర్టుకు తెలిపాడు. అంతటి భారీ మొత్తాన్ని చెల్లించడం తన ఆర్థిక స్తోమతకు మించిన విషయమని, ఫ్యామిలీ కోర్ట్ తన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోలేదని వాదించాడు.
అయితే విచారణ సందర్భంగా మొదటి భార్య తరపు న్యాయవాది సంచలన విషయాలను కోర్టు దృష్టికి తెచ్చారు. ఆసిఫ్ పని చేస్తున్న హార్డ్‌వేర్ షాపు అతని తండ్రిదేనని.. దానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా ఉందని వెల్లడించారు. అంతేకాకుండా పిటిషనర్ ఇప్పటికే రెండో వివాహం చేసుకున్నాడని, రెండో భార్యను పోషిస్తూ మొదటి భార్యను గాలికి వదిలేశాడని ఆధారాలతో సహా నిరూపించారు. బాధితురాలు నిరుద్యోగి అని, ప్రస్తుతం తన తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తోందని కోర్టుకు వివరించారు.
ఈ కేసులో సుప్రీంకోర్టు గతంలో 'షమీమా ఫరూఖీ వర్సెస్ షాహిద్ ఖాన్' కేసులో ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తు చేసింది. "ఒక వ్యక్తి రెండో భార్యను పోషించగలిగినప్పుడు, మొదటి భార్య పట్ల తన బాధ్యతలను విస్మరించడానికి ఎటువంటి కారణం ఉండదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనే సాకుతో చట్టబద్ధమైన భార్యకు భరణం నిరాకరించలేరు" అని జస్టిస్ హర్వీర్ సింగ్ పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం పిటిషనర్ పన్ను చెల్లింపుదారుడని, ఆర్థికంగా బలంగా ఉన్నాడని కోర్టు గుర్తించింది. అందుకే ఫ్యామిలీ కోర్ట్ నిర్ణయించిన రూ. 20,000 భరణం సరైనదేనని సమర్థించింది. భార్య విడిగా ఉంటున్నప్పుడు ఆమెకు కనీస జీవన ప్రమాణాలను కల్పించడం భర్త నైతిక, చట్టపరమైన బాధ్యత అని కోర్టు పునరుద్ఘాటించింది.
Latest News