|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 09:01 PM
భారత దేశంలో మారుతున్న సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత స్వేచ్ఛపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో సహజీవనం చేస్తున్న జంటలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపైనే ఉందని కోర్టు స్పష్టం చేసింది. తమ కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, పోలీసుల నుంచి సరైన స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. 12 జంటలు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు రాజ్యాంగబద్ధమైన హక్కుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. "ఒక వ్యక్తి వివాహం చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ప్రతి పౌరుడికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను రాజ్యాంగం ప్రసాదించింది. కేవలం పెళ్లి చేసుకోలేదన్న కారణంతో వారి ప్రాథమిక హక్కులను కాలరాయలేం" అని కోర్టు పేర్కొంది. సామాజిక నైతికత, చట్టబద్ధమైన హక్కుల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ.. సమాజం ఈ సంబంధాలను అంగీకరించకపోవచ్చు గానీ, చట్టం వీటిని నిషేధించలేదని స్పష్టం చేసింది.
మేజర్ల నిర్ణయంలో ఇతరుల జోక్యం తగదు
ఒక వ్యక్తి మేజర్ (18 ఏళ్లు నిండిన వారు) అయితే.. తాను ఎవరితో ఉండాలి, ఎక్కడ నివసించాలి అనే నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛ వారికి ఉంటుందని ధర్మాసనం గుర్తుచేసింది. "ఒక మేజర్ తన భాగస్వామిని ఎంచుకున్నప్పుడు.. అందులో కుటుంబ సభ్యులు గానీ, ఇతరులు గానీ అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదా వారి ప్రశాంత జీవనానికి అడ్డంకులు సృష్టించడానికి వీల్లేదు" అని తీర్పులో పేర్కొంది. గతంలో కొన్ని కోర్టులు ఇలాంటి జంటలకు రక్షణ నిరాకరించిన ఉదంతాలను ప్రస్తావిస్తూ.. సుప్రీం కోర్టు వెలువరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని, పాత తీర్పులతో తాము ఏకీభవించడం లేదని జడ్జి స్పష్టం చేశారు.
పిటిషన్ దాఖలు చేసిన 12 జంటలు ఎటువంటి నేరానికి పాల్పడలేదని, కేవలం తమకు నచ్చిన విధంగా జీవిస్తున్నారని కోర్టు గుర్తించింది. అందుకే వారికి రక్షణ కల్పించకపోవడానికి ఎటువంటి చట్టపరమైన కారణాలు లేవని తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఈ జంటలకు వారి కుటుంబాల నుండి ఎలాంటి ముప్పు ఎదురైనా తక్షణమే స్పందించాలని పోలీసులకు వివరణాత్మక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా పోలీసు అధికారుల వద్దకు వెళ్లినా ఫలితం లేకపోవడం వల్లే బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, ఈ ధోరణి మారాలని కోర్టు వ్యాఖ్యానించింది.
Latest News