|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 09:02 PM
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని విగ్రహాలకు సువర్ణ తాపడం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగారం వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కు న్యాయస్థానం అనుమతిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో కీలక డాక్యుమెంట్లు, సాక్షుల వాంగ్మూలాలు సహా సంబంధిత పత్రాలను ఈడీకి అప్పగించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొల్లం విజిలెన్స్ కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీలు, అరెస్టైన ఏడుగురికి సంబంధించి సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులు సహా ఇతర కీలక దస్త్రాలను తక్షణమే అందజేయాలని స్పష్టం చేసింది.
దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదుకు పోలీసు డాక్యుమెంట్లు తప్పనిసరి అని సంబంధిత వర్గాలు తెలిపారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఈడీ ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. సంచలనం సృష్టించిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు తాపడం కేసుపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సమయంలో మనీలాండరింగ్ అంశంై దర్యాప్తునకు అనుమతించాలని కోరుతూ ఈడీ కేరళ హైకోర్టునలో పిటిషన్ వేసింది.
అయితే, విజిలెన్స్ కోర్టు వెళ్లాలని హైకోర్టు సూచించడంతో కొల్లాం విజిలెన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది..ఈడీ విజ్ఞప్తిని వ్యతిరేకించిన సిట్.. సమాంతరంగా విచారణ చేపట్టడం దర్యాప్తును ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడింది. అయినప్పటికీ సిట్ అభిప్రాయాన్ని తోసిపుచ్చిన కోర్టు.. ఈడీకి అనుమతి ఇచ్చింది.
సన్నిధానంలోని ద్వారపాలకులకు విగ్రహాలకు చేసిన బంగారు తాపడాలను మరమ్మతుల కోసం తీసుకెళ్లగా.. వాటి బరువు తగ్గిపోయిన విషయం బయటపడి.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2019లో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసిన మురారి బాబు బంగారం మాయం వివాదం మొదలైంది. ఆలయానికి చెందిన బంగారు పూతతో ఉన్న పలకలను.. అధికారిక రికార్డుల్లో రాగి పలకలు అని మురారి బాబు నమోదు చేశారు. అయితే, తాను తప్పుగా పేర్కొన్నట్టు ఆయన సిట్ విచారణలో వెల్లడించడం గమనార్మం.
Latest News