|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:27 PM
విమానయాన చరిత్రలో చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ చరిత్రను తిరగరాసింది. చైనా రాజధాని షాంఘై నుంచి అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఏరీస్ వరకు ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన విమాన మార్గాన్ని ప్రారంభించింది. సుమారు 19,631 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేందుకు మొత్తం 25 గంటల 30 నిమిషాల సమయం పడుతుందని సంబంధిత ఎయిర్ లైన్స్ తెలిపింది. ఇప్పటివరకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ పేరిట ఉన్న రికార్డును.. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ తుడిచిపెట్టేసింది. ఈ కొత్త రూట్ ద్వారా చైనా, దక్షిణ అమెరికా మధ్య ప్రయాణ సమయం 4 గంటల కంటే ఎక్కువగా తగ్గనుంది.
చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంయూ745 విమానం షాంఘైలోని పుదాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ గోళార్థాలను దాటుకుంటూ సుమారు 20 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. షాంఘై నుంచి బయలుదేరిన ఈ విమానం న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో.. ఇంధనం నింపడంతోపాటు.. సిబ్బంది మారడం కోసం కొద్దిసేపు ఆగనుంది. అయితే.. ఆ విమానంలోని ప్రయాణికులు ఇంకో విమానంలోకి మారాల్సిన అవసరం లేకుండా. అదే విమానం నేరుగా బ్యూనస్ ఐరీస్‌కు చేరుకుంటుంది.
ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన విమాన మార్గంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన న్యూయార్క్-సింగపూర్ (19 గంటలు) విమానం నడిచేది. తాజాగా చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ప్రారంభించిన ఈ విమానంతో ఆ రికార్డు కనుమరుగైంది. క్వాంటాస్ ఎయిర్‌వేస్ 2027లో సిడ్నీ-లండన్ మధ్య 22 గంటల నాన్‌స్టాప్ సర్వీసును ప్రారంభించాలని ప్లాన్ చేస్తుండగా.. అంతకంటే ముందే ఈ భారీ రికార్డును చైనా ఈస్టర్న్ తన ఖాతాలో వేసుకుంది. తిరుగు ప్రయాణంలో గాలుల ప్రభావం వల్ల ప్రయాణ సమయం మరో 4 గంటలు అదనంగా అంటే దాదాపు 30 గంటలు పడుతుందని చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.
ఈ అసాధారణ ప్రయాణం కోసం చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777-300 ఈఆర్ విమానాన్ని ఉపయోగిస్తోంది. ఇది డబుల్ డెక్కర్ కాకపోయినప్పటికీ.. సుదీర్ఘ ప్రయాణాలకు అత్యంత అనువైనదిగా పేరుగాంచింది. ఇందులో మొత్తం 316 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ విమానం వారానికి రెండుసార్లు మాత్రమే తన సేవలను అందించనుంది. తొలి విమానం షాంఘై నుంచి తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి.. బ్యూనస్ ఐరీస్‌లోని ఎజైజా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు షెడ్యూల్ కంటే 10 నిమిషాల ముందే చేరుకోవడం విశేషం.
గతంలో చైనా నుంచి దక్షిణ అమెరికా దేశాలకు వెళ్లాలంటే యూరప్ లేదా ఉత్తర అమెరికా మీదుగా ప్రయాణించాల్సి వచ్చేది. దీనికి దాదాపు 30 గంటల కంటే ఎక్కువ ప్రయాణ సమయం పట్టేది. ఈ కొత్త సౌత్ కారిడార్ ద్వారా ప్రయాణ సమయం 25 గంటలకు తగ్గడం వల్ల వాణిజ్య, పర్యాటక రంగాలకు మరింత అనువుగా మారినట్లయింది. ఈ మార్గం 3 ఖండాల మధ్య విమాన ప్రయాణాన్ని అనుసంధానించనుంది.
Latest News