|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:29 PM
ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టీన్ సెక్స్ కుంభకోణం వ్యవహారం అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా, ఎప్‌స్టీన్ ఎస్టేట్‌లోని పలువురు ప్రముఖుల ఫోటోలను అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు గురువారం విడుదల చేశారు. దీంతో ఎప్‌స్టీన్ కేసులో ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలను విడుదలకు గడువు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరింత ఒత్తిడి పెరిగింది. ఎపిస్టీన్ ఎస్టేట్‌లో కాంగ్రెస్ సేకరించిన ఫోటోను కొద్దికొద్దిగా విడుదల చేస్తున్నారు. కొత్తగా విడుదలైన ఫోటోలలో వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, గుర్తింపు పత్రాలు ఉన్నాయి.
అయితే, చాలా వరకు వ్యక్తిగత వివరాలను ఇందులో తొలగించారు. కొన్ని పత్రాలపై ‘మహిళ’ అని గుర్తించారు. ఉక్రెయిన్, రష్యా వంటి దేశాల పాస్‌పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. కొందరి ముఖాలను గుర్తించకుండా అస్పష్టంగా ఉంచారు. ఈ ఫోటోలలో ప్రముఖ మేధావి నోమ్ చోమ్‌స్కీ , ఎప్‌స్టీన్‌తో విమానంలో కూర్చున్నట్లుగా రెండు ఫోటోలు ఉన్నాయి. అలాగే, బిల్ గేట్స్ ఒక మహిళ పక్కన నిలబడి ఉన్న ఫోటో కూడా ఉంది. ఈ మహిళ ముఖం కూడా అస్పష్టంగా ఉంది. గతంలో విడుదలైన ఫోటోలలో కనిపించిన వూడీ అలెన్, ట్రంప్ మాజీ వ్యూహకర్త స్టీవ్ బెన్నన్ ఫోటోలు కూడా ఈ కొత్త బ్యాచ్‌లో ఉన్నాయి. ఎపిస్టీన్‌తో సంబంధాలే బిల్ గేట్స్, ఆయన భార్య మిలిండా విడాకులకు కారణమనే ప్రచారం కూడా ఉంది.
ఈ కొత్త ఫోటోలలో ఎవరూ చట్టవిరుద్ధమైన పనులు చేసినట్లుగా కనిపించడం లేదు. అయితే, ఒక టెక్స్ట్ మెసేజ్ స్క్రీన్‌షాట్ ఉంది. అందులో ఎవరో తెలియని వ్యక్తి యువతులను రిక్రూట్ చేయడం గురించి మాట్లాడుతున్నట్లు ఉంది. ఆ మెసేజ్‌లో ‘నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఆమె కొందరు అమ్మాయిలను పంపింది. కానీ ఒక్కో అమ్మాయికి 1000 డాలర్లు అడుగుతుంది. నేను ఇప్పుడు నీకు అమ్మాయిలను పంపుతాను. బహుశా J కి ఎవరైనా మంచివారు దొరుకుతారేమో?’ అని ఉంది. ఈ స్క్రీన్‌షాట్‌లో ఒకరి వయస్సు ‘18 ఏళ్లు’ అని, వారి శారీరక వర్ణనలో కొంత భాగం తొలగించారు. కానీ మాట్లాడేవారు ఎవరో, ఎవరి గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా లేదు.
మరో ఫోటోలో ఒక మహిళ పాదంపై ‘లోలితా’ అనే నవల నుంచి ఒక వాక్యం చేతితో రాసి ఉంది. ఈ నవల ఒక మనిషికి ఒక చిన్న పిల్లపై ఉన్న లైంగిక వ్యామోహం గురించి చెబుతుంది. వీటిని కూడా ఎటువంటి వివరణ లేకుండా విడుదల చేశారు. డెమొక్రాట్ల ప్రకారం.. వారికి సమాచారం అందిన వెంటనే బాధితుల గుర్తింపు వివరాలను తొలగించి విడుదల చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ పారదర్శకతను పర్యవేక్షించే రిపబ్లికన్లు.. డెమొక్రాట్లు తమకు అనుకూలమైన కథనాన్ని సృష్టించడానికి సమాచారాన్ని ‘ఎంపిక చేసుకుని’ విడుదల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గత నెలలో ఇరు పార్టీల మద్దతుతో ఆమోదించిన ఎపిస్టీన్ ఫైల్స్‌కు సంబంధించి ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ ప్రకారం.. శుక్రవారం నాటికి న్యాయ శాఖ కీలక పత్రాలను విడుదల చేయాల్సి ఉంది. ఈ చట్టం ప్రకారం.. బాధితుల గుర్తింపును కాపాడుతూ, అత్యంత సమగ్రమైన ఎప్‌స్టీన్ సంబంధిత పత్రాలను DOJ ప్రచురించాలి.
ప్రపంచంలోని ప్రముఖులతో సంబంధాలు కొనసాగించి, వారికి అమ్మాయిల్ని సరఫరా చేసిన ఎప్‌స్టీన్.. 2019లో న్యూయార్క్ జైలులో మరణించాడు. లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సమయంలో అతడి మరణం సంభవించింది. దీనిని ఆత్మహత్యగా నిర్ధారించినప్పటికీ, దీని వెనుక కుట్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ‘ఎప్‌స్టీన్ ఎస్టేట్ ఫోటోలు, పత్రాలను విడుదల చేయడం ద్వారా అమెరికా ప్రజలకు పారదర్శకతను అందిస్తూనే ఉంటాం’ అని కమిటీకి చెందిన సీనియర్ డెమొక్రాట్ రాబర్ట్ గార్సియా అన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను న్యాయశాఖ వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.
Latest News