|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:37 PM
బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత షరీఫ్ ఉస్మాన్ హాడీ సింగపూర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. గత వారం ఢాకాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాడీకి ఢాకాలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలించారు. ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు సింగ్‌పూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ హాడీ మరణాన్ని ధ్రువీకరించింది. హాడీ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హాడీ మరణంతో బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసనలు మిన్నంటాయి.
గత ఏడాది జులై ఆగస్టులో జరిగిన బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమంలో హాడీ కీలక పాత్ర పోషించాడు. ఈ ఉద్యమం 15 ఏళ్ల షేక్ హసీనా పాలనకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ‘ఇంక్విలాబ్ మంచా’ అనే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించిన ఉస్మాన్ హాడీ.. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 32 ఏళ్ల విద్యార్థి నేత1994లో జన్మించారు. భారత్ పట్ల ద్వేషం ప్రదర్శించేవాడని.. 'గ్రేటర్ బంగ్లాదేశ్' పేరుతో భారత భూభాగాలను కలిపి కొత్త మ్యాప్‌లు రూపొందించిన ప్రచారం చేశారని వార్తలు వచ్చాయి.
డిసెంబర్ 12న ఢాకాలోని పాల్టన్ ప్రాంతంలో హాడీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఆయన తలకు గాయం కాగా.. మొదట ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి, ఆ తర్వాత ఎవరెస్ట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనను సింగపూర్‌కు తరలించింది. హాడీ హంతకుల కోసం బంగ్లాదేశ్ పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు ఇద్దరు అనుమానితుల ఫోటోలను విడుదల చేసిన పోలీసులు.. వారి గురించి ఆచూకీ ఇస్తే 5 మిలియన్ టాకాలు (సుమారు 42,000 డాలర్లు) రివార్డు ప్రకటించారు. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హాడీ మరణం పట్ల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆదేశించారు. హాడీ కుటుంబ సుకుంటుందని హామీ ఇచ్చారు. శనివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పాలన ముగినిన తర్వాత బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతోందని, 1971 విమోచన యుద్ధ వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్‌తో సంబంధాలు తెంచుకుని పాకిస్థాన్‌తో స్నేహం పెంచుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ రాజకీయ వేదికల నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు వస్తున్నాయని, ముఖ్యంగా భారత ఈశాన్య రాష్ట్రాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. హాడీపై దాడి జరిగిన కొద్ది రోజులకే, యూనస్ ప్రభుత్వం భారతదేశ సహాయం కోరింది. అయితే, దాడి చేసిన వారికి భారతదేశంతో ఎలాంటి సంబంధం లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. ఈ దాడి వెనుక ఉన్న కుట్రను భారతదేశం ఖండించింది.