|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:38 PM
అమెరికాకు వెళ్లాలని కలలు కనే కోట్లాది మంది విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భారీ షాక్ ఇచ్చింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న 'గ్రీన్ కార్డ్ లాటరీ' (డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్)ను తక్షణమే నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఇటీవల అగ్రరాజ్యంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది.
కొద్దిరోజుల క్రితం అమెరికాలోని ప్రసిద్ధ 'బ్రౌన్ యూనివర్సిటీ'లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి పోర్చుగీస్ జాతీయుడని దర్యాప్తులో తేలింది. అయితే ఆ నిందితుడు అసలు అమెరికాలోకి ఎలా ప్రవేశించాడనే కోణంలో విచారణ జరపగా.. అతను 'గ్రీన్ కార్డ్ లాటరీ' ద్వారానే దేశంలోకి అడుగు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇలాంటి నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తులు సులభంగా దేశంలోకి రావడానికి ఈ విధానం మార్గంగా మారుతోందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు ఈ ఘటనపై హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ స్పందిస్తూ.. "మన దేశంలోకి ఇటువంటి దారుణమైన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదు" అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్‌ను వెంటనే నిలిపివేయాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌ను ఆదేశించారు. ఈ నిర్ణయంతో ఇకపై డైవర్సిటీ వీసా కింద కొత్త దరఖాస్తులను స్వీకరించడం నిలిచిపోనుంది.
అసలేమిటీ డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్?
అమెరికాలోని వలస జనాభాలో వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద ప్రతి ఏటా సుమారు 55,000 గ్రీన్ కార్డులను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. అమెరికాకు తక్కువ సంఖ్యలో వలస వెళ్లే దేశాల పౌరులకు ఈ విధానం ద్వారా శాశ్వత నివాసం పొందే అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పుడు భద్రతా కారణాలతో ఈ ప్రక్రియకు ట్రంప్ బ్రేక్ వేశారు. ట్రంప్ మొదటి నుంచి అక్రమ వలసలపై కఠినంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు చట్టబద్ధంగా ఉండే లాటరీ విధానాన్ని కూడా రద్దు చేయడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం వల్ల ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనుకునే మధ్య తరగతి ప్రజలకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది.
Latest News