|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 07:30 AM
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఓట్లు తొలగింపునకు గురయ్యాయి. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ శుక్రవారం విడుదల చేసింది. ఒక్క తమిళనాడులోనే సుమారు 97.37 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించినట్లు అధికారులు ప్రకటించారు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ తొలగింపుల తర్వాత తమిళనాడులో మొత్తం ఓటర్ల సంఖ్య 6.41 కోట్ల నుంచి 5.43 కోట్లకు తగ్గింది. తొలగించిన వారిలో 26.94 లక్షల మంది మరణించగా, 66.44 లక్షల మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వలస వెళ్లారని, మరో 3.39 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని ఆమె వివరించారు.ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొలత్తూర్ నియోజకవర్గంలో 1.03 లక్షల ఓట్లు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ నియోజకవర్గంలో 89 వేల ఓట్లు తగ్గడం గమనార్హం. రాజధాని చెన్నైలో అత్యధికంగా 14.25 లక్షల ఓట్లు, కోయంబత్తూరు జిల్లాలో 6.5 లక్షల ఓట్లను జాబితా నుంచి తొలగించారు.
Latest News