|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 11:59 AM
చంద్రబాబు మార్క్ దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే నిదర్శనమని, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ప్రజారోగ్యాన్ని, వైద్య విద్య అభ్యసించాలన్న పేద విద్యార్థుల కలను పణంగా పెడుతున్నాడని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే యూజర్ చార్జీల రూపంలో ప్రజలపై పెనుభారం మోపడం ఖాయమని, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉచితంగా అందిన వైద్య సేవలన్నీ రాబోయే రోజుల్లో డబ్బులు చెల్లించి పొందాల్సిన పరిస్థితి వస్తుందని వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని, ఈ ఉద్యమంతో కూటమి నాయకుల్లో వణుకు మొదలైందని చెప్పారు. కాబట్టే దాన్ని తక్కువ చేసి చూపించేలా కూటమి నాయకులతో సంతకాలు చేసిన ప్రజలను సైకోలు అని తిట్టిస్తూ చంద్రబాబు రోజురోజుకీ దిగజారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణపై విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం ఖాయమన్నారు.
Latest News