|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 11:58 AM
మంత్రి నారా లోకేష్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని తాడేపల్లికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై తాడేపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో విచారణ కోసం, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై.నాగార్జునయాదవ్‌తో కలిసి పట్టణ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మాజీ ఎంపీ, విచారణ తర్వాత స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ... కేవలం ప్రభుత్వాన్ని విమర్శించినందుకే వైయస్ఆర్‌సీపీ నాయకులపై కేసులు పెడుతున్న పోలీసులు.. మాజీ సీఎం జగన్‌గారిని, మా పార్టీ నాయకులను తీవ్ర పదజాలంతో దూషిస్తున్న కూటమి నాయకులు, కార్యకర్తలపై కనీసం ఫిర్యాదులు కూడా స్వీకరించడం లేదు. అసలు మా ఫిర్యాదులు స్వీకరించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా?. ఇకనైనా రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేయాలని డీజీపిని కోరుతున్నాను.రాష్ట్రంలో పౌరుల హక్కులను, వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాస్తూ అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో అధికార కూటమి ఉంది. దీంతో మా పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆ కేసులకు మా నాయకులెవ్వరూ భయపడే ప్రసక్తి లేదు. ప్రభుత్వాన్ని ఇంకా గట్టిగా ప్రశ్నిస్తారు అని తెలిపారు.
Latest News