|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 11:57 AM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలతో రాష్ట్ర ప్రజలు సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని ఎండగట్టారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కోటి సంతకాల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వచ్చిన అత్యుత్తమ ప్రజా స్పందనగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాల్లో ప్రైవేటీకరణను నిరసిస్తూ... 1.04 కోట్ల కుటుంబాలు సంతకాలు చేశాయని.. ఇది కచ్చితంగా ప్రభుత్వ తీరుపై రెఫరెండమేనని తేల్చిచెప్పారు. ఆయన స్పష్టం చేశారు. వైయస్.జగన్ పిలుపు మేరకు వైయస్ఆర్‌సీపీ శ్రేణులు కోటిసంతకాల ఉద్యమంలో మేధావులు, విద్యార్ధులు, మహిళలు, రాజకీయ పక్షాలతో మమేకమైనప్పుడు.. ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్న భావనలో ప్రజలు ఉన్నారన్న విషయం స్పష్టమైందన్నారు. అయితే పార్లమెంటరీ కమిటీ రిపోర్టుకూ వక్రభాష్యం చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. రోజుకు రూ.550 కోట్లు చొప్పున, 18 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు.. ఒక రోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తి చేయవచ్చని.. అయినా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకే మొగ్గు చూపడం దుర్మార్గమని మండిపడ్డారు. కేవలం వైయస్.జగన్ కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు గంట యోగా ఖర్చుకు రూ.330 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసిన చంద్రబాబు... ప్రజల సొమ్మును విపరీతంగా దుబారా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వెనుక భారీ స్కామ్ దాగి ఉందని.. భూమి, భవనాలు, ఆస్తులు ప్రభుత్వానివి అయితే... ఆదాయం మాత్రం ప్రైవేటు వారికి దోచిపెట్టడం దారుణమన్నారు. పైగా ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వ ఖజానా నుంచి రెండేళ్లు జీతాలు చెల్లించాలన్న నిర్ణయం అత్యంత దారుణమన్న అప్పలరాజు.. పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తున్న చంద్రబాబు విజనరీ కాదు, విషనరీ అని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి రాగనే కచ్చితంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుదన్నారు. విశాఖలో గోమాంసం దొరికితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరువిప్పలేదని ప్రశ్నించిన ఆయన... తనను తాను సనాతని అని చెప్పుకునే పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. పరకామణి కేసు సెటిల్మెంట్ కోర్టు పరిధిలో జరిగితే.. దానికి, వైయస్ఆర్‌సీపీకి ఏం సంబంధని.. దాన్ని కూడా రాజకీయం చేయటం పవన్ సంకుచిత బుద్దికి నిదర్శనమని మండిపడ్డారు.
Latest News