|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:35 PM
అభివృద్ధిలో, పార్టీ బలోపేతం చేసే విషయంలో మంగళగిరి నియోజకవర్గంతో పోటీ పడతామంటూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన సవాల్‌ను తాను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ప్రేమతో ప్రజల మనసులను గెలుచుకుంటూ, వారితో మమేకమై ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. రాజమండ్రిలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన రాజమండ్రి పట్టణ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన ఆదిరెడ్డి కుటుంబాన్ని జీవితంలో మర్చిపోలేనని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. "చంద్రబాబు గారిని 53 రోజుల పాటు అక్రమంగా ఇదే రాజమండ్రి జైలులో బంధించినప్పుడు ఆదిరెడ్డి కుటుంబం మాకు అండగా నిలిచింది. శాసనసభలో నా తల్లిని అవమానించినట్లే, ఆదిరెడ్డి భవానీ గారిని కూడా అవమానించారు. ఎన్నో ఇబ్బందులు పెట్టినా, జై తెలుగుదేశం నినాదానికే ఆ కుటుంబం కట్టుబడింది. నాడు, నేడు, ఎప్పుడూ టీడీపీ కూడా ఆదిరెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తుంది" అని లోకేశ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును తన కుటుంబ సభ్యుడిలా భావిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Latest News