|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:40 PM
చిన్నతనంలోనే తల్లిని కోల్పోతే, భారతీయ జనతా పార్టీయే తనను తల్లిలా ఆదరించి, పెంచి పెద్ద చేసిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. విజయనగరంలో జరిగిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, తన రాజకీయ జీవితం గురించి, పార్టీ గొప్పతనాన్ని వివరించారు.16వ ఏటనే రాజకీయాల్లోకి వచ్చి జెండాలు కట్టే స్థాయి నుంచి అదే పార్టీకి అధ్యక్షుడిగా ఎదిగానని, వాజ్‌పేయ్, అద్వానీల మధ్య కూర్చునే గౌరవం దక్కిందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తన జీవితమే ఉదాహరణ అని చెబుతూ, అదే బీజేపీ గొప్పతనమని అన్నారు.తన రాజకీయ జీవితంలోని ఓ ఉద్వేగభరిత ఘట్టాన్ని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. తనను ఉపరాష్ట్రపతిగా ప్రకటించినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. అయితే, అది మంత్రి పదవి పోతోందన్న బాధతో కాదని, తల్లిలాంటి భారతీయ జనతా పార్టీని వీడాల్సి వస్తోందన్న ఆవేదనతోనే కంటతడి పెట్టానని ఆయన స్పష్టం చేశారు.సుపరిపాలన అంటే అట్టడుగు వర్గాలకు అవకాశం కల్పించడం, మహిళలపై అఘాయిత్యాలు లేని సమాజాన్ని నిర్మించడం అని వెంకయ్య నాయుడు నిర్వచించారు.
Latest News