|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 07:32 PM
తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులకు తీపికబురు. క్రికెట్ మ్యాచ్‍ల టికెట్ రేట్లను తగ్గించారు. విశాఖపట్నంలోని ఏసీఏ- వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ - శ్రీలంక మహిళల జట్ల మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. డిసెంబర్ 21న మొదటి టీ20 మ్యాచ్, డిసెంబర్ 23న రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. పీఎంపాలెంలోని ఏసీఏ- వీడీసీఏ స్టేడియంలో ఈ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టీ20 మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ఇప్పటికే మొదలయ్యాయి. అయితే మ్యాచ్‌లకు ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలనే ఉద్దేశంతో స్టేడియం అధికారులు క్రికెట్ మ్యాచ్ టికెట్ రేట్లు తగ్గించారు. టికెట్ రేట్లను రూ.200, రూ.300, రూ.350, రూ.400లుగా నిర్ణయించారు.
మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు.. ఇటీవల వన్డే ప్రపంచకప్ నెగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఈ క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని స్టేడియం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో విశాఖ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటుగా.. మహిళల ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లకు కూడా విశాఖ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత ఇటీవలే భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఇప్పుడు భారత్, శ్రీలంక మహిళల క్రికెట్ జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ రెండు మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత 2026 జనవరి 26న విశాఖపట్నం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. దీంతో విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం రెండు నెలల వ్యవధిలోనే నాలుగు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక కానుంది. దీంతో క్రికెట్ ప్రేమికులు ఖుషీ అవుతున్నారు.
ఇవి పూర్తి అయిన తర్వాత.. ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా విశాఖ ఆతిథ్యం ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. మరోవైపు భారత క్రికెట్ మహిళల జట్టు.. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ఇటీవల వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. దీంతో భారత మహిళల జట్టుపై దేశవ్యా్ప్తంగా ప్రశంసల వర్షం కురిసింది.
Latest News