|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 07:38 PM
2026 జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం రోజున సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో పర్యటించారు. తాళ్లపాలెంలో జరిగిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. వచ్చే జూన్ నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించారు. అయితే అందుకు ప్రజా భాగస్వామ్యం అవసరమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వదిలి వెళ్లిన సుమారు 86 లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు చంద్రబాబు వివరించారు. చెత్తను సంపదగా మార్చాలనే ఉద్దేశంతో రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాటికి రాష్ట్రంలోని రోడ్లపై చెత్త కనిపించకూడదని అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా స్వచ్ఛ రథాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. స్వచ్ఛ రథాల సాయంతో గ్రామాల్లోని ఇళ్ల వద్దకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు. అలాగే చెత్తకు బదులుగా సరుకులను ఉచితంగా అందిస్తున్నారు. ఈ స్వచ్ఛరథం ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల ప్రవేశపెట్టారు. ఆయా ప్రాంతాల్లో మంచి స్పందన లభించడంతో ప్రస్తుతం 26 చోట్ల ఈ స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అవసరమైతే 100 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేసి పొడి చెత్తను సేకరిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఇక ఇళ్లల్లోని పొడి చెత్తను రోడ్లపై వేయడం మానుకోవాలని చంద్రబాబు సూచించారు. పొడిచెత్తకు కూడా డబ్బులు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. రోడ్లు కూడా మనవేననే సంగతి ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఇంట్లో చెత్తను కంపోస్ట్‌గా తయారు చేసుకోవచ్చన్న చంద్రబాబు.. రాబోయే రోజుల్లో పట్టణాల్లో 5 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 10 లక్షల ఇళ్లల్లో ఇలాంటి కంపోస్ట్ తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
మరోవైపు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన చంద్రబాబు.. ఏపీ పాఠశాలల్లో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి విద్యార్థినులతో ముచ్చటించారు. ముస్తాబు కార్యక్రమం ద్వారా విద్యార్ధుల వ్యక్తిగత శుభ్రత పాటించే విధానాలను స్వయంగా పరిశీలించారు.
Latest News