|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 07:43 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. యూఎఫ్ఎస్ సర్వే పేరుతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ఏకీకృత సర్వేను నిర్వహిస్తోంది. డిసెంబర్ 18వ తేదీ నుంచి ఏపీలోని పలుచోట్ల ఈ ఏకీకృత సర్వే ప్రారంభమైంది. నెల రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే పలుచోట్ల అధికారులు సర్వే పనిలో నిమగ్నమయ్యారు. సచివాలయ సిబ్బంది ఈ ఏకీకృత సర్వేను నిర్వహిస్తున్నారు. ఏకీకృత సర్వేలో భాగంగా గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి.. ఆ ఇంట్లోని కుటుంబసభ్యుల వివరాలు సేకరించనున్నారు. అలాగే ప్రతి కుటుంబంలో నుంచి ఓ కుటుంబసభ్యుడి వేలిముద్రలు తీసుకుంటారు. అనంతరం మొబైల్ యాప్ సాయంతో సచివాలయ సిబ్బంది ఏకీకృత సర్వేను పూర్తి చేయనున్నారు. ఇందుకోసం సర్వేలో పాల్గొనే సిబ్బందికి ప్రభుత్వం ఇప్పటికే శిక్షణ అందించింది.
ఏకీకృత సర్వేలో అడిగే ప్రశ్నలు..
మరోవైపు ఏకీకృత సర్వేలో భాగంగా మొత్తం 38 రకాల ప్రశ్నలను అడిగి సచివాలయ సిబ్బంది వివరాలను సేకరించనున్నారు. ఏకీకృత సర్వేలో భాగంగా వ్యక్తిగత వివరాలతో పాటుగా తల్లిదండ్రుల వివరాలను, విద్య, ఉద్యోగం, ఏం పని చేస్తున్నారనే వివరాలను నమోదు చేసుకుంటారు. అలాగే ఇంట్లోని గృహోపకరణాలు, ఏమేం వాహనాలు ఉన్నాయి, కుటుంబ ఆదాయం ఎంత మేరకు ఉందనే వివరాలను కూడా సేకరిస్తారు. అలాగే ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హతకు సంబంధించిన పత్రాలు, ఓటరు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు వంటివి పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత టెక్నాలజీ సాయంతో ఇంటిని మ్యాపింగ్ చేస్తారు. దీంతో ఏకీకృత సర్వే పూర్తవుతుంది.
ఏకీకృత సర్వేతో ప్రయోజనాలు...
మరోవైపు ప్రభుత్వం చేపడుతున్న ఏకీకృత సర్వేతో అనేక ప్రయోజనాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు సర్వేను ప్రామాణికంగా తీసుకుంటారని చెప్తున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ సేవలో వంటి పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాలతో పాటుగా కొత్తగా ఏదైనా పథకం అమలు చేస్తే.. దానికి ఈ సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకుంటారని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఏకీకృత సర్వే పూర్తి చేయించుకోవాలని సూచిస్తున్నారు.
Latest News