|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 08:57 PM
డబ్బు మీద ఆశ మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది అనడానికి తమిళనాడులో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. తిరువళ్లూరు జిల్లాలో రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం ఇద్దరు కుమారులు తమ తండ్రిని అత్యంత దారుణంగా పాము కాటుతో చంపించారు. మొదట దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అందరూ భావించినప్పటికీ.. ఇన్సూరెన్స్ సంస్థకు వచ్చిన అనుమానం ఈ మిస్టరీని ఛేదించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల వచ్చిన అప్పులను తీర్చుకోవడానికి కన్నతండ్రినే ఇద్దరు కుమారులు కడతేర్చిన ఈ అమానుష ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
తిరువళ్లూరు జిల్లా పొదటూర్‌పేట్‌కు చెందిన ఈపీ గణేశన్ అనే 56 ఏళ్ల వ్యక్తి.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 22వ తేదీన ఈపీ గణేశన్.. తన ఇంట్లోనే పాము కాటు వేయడంతో మరణించారు. ఆయన కుమారుడు మోహన్‌రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు సాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. అయితే ఈపీ గణేశన్ పేరు మీద ఉన్న రూ. 3 కోట్ల భారీ బీమా క్లెయిమ్ కోసం కుమారులు దరఖాస్తు చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది.
ఈపీ గణేశన్ మరణించిన వారం రోజుల్లోనే కుమారులు క్లెయిమ్ కోసం రావడంతో పాటు.. అతని పేరు మీద ఆదాయానికి మించి అధిక మొత్తంలో పాలసీలు ఉండటాన్ని బీమా అధికారులు గుర్తించారు. ఆ ఇద్దరు కుమారుల ప్రవర్తనపైనా.. ఇన్సూరెన్స్ అధికారులకు అనుమానం రావడంతో ఐజీ అస్రా గార్గ్, ఎస్పీ వివేకానంద శుక్లా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి విచారణ జరపగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితులైన ఈపీ గణేశన్ కుమారులు మోహన్‌రాజ్ (26), హరిహరన్ (27) ప్రైవేట్ ఉద్యోగులు కాగా.. వీరిద్దరూ ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, ఇతర వ్యసనాల వల్ల భారీగా అప్పుల పాలయ్యారు. తండ్రిని చంపితే ఇన్సూరెన్స్ డబ్బుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని వారు భారీ స్కెచ్ వేశారు. అయితే అక్టోబర్ 15వ తేదీనే తమ స్నేహితుల సాయంతో అటవీ ప్రాంతంలో ఒక నాగు పామును తీసుకొచ్చి నిద్రిస్తున్న తండ్రి కాలుపై కరిపించేలా చేశారు. అయితే స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
మొదటి ప్రయత్నం విఫలం కావడంతో.. ఈసారి మరింత విషపూరితమైన కట్టుపామును తీసుకువచ్చారు. అక్టోబర్ 22వ తేదీన తెల్లవారుజామున తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఆయన మెడపై ఆ పాముతో కాటు వేయించారు. ఈసారి ఆయన ప్రాణాలు పోయే వరకు ఆస్పత్రికి తరలించకుండా కావాలనే ఆలస్యం చేశారు. పోలీసులు నిందితుల ఫోన్ కాల్ డేటా, రూ. 2 లక్షల అనుమానాస్పద నగదు లావాదేవీలను పరిశీలించారు. ఈ కుట్రలో కుమారులకు సహకరించిన వారి ఫ్రెండ్స్ బాలాజీ, ప్రశాంత్, దినకరన్, నవీన్ కుమార్‌లను కూడా పోలీసులు గుర్తించారు. నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
Latest News