|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 09:05 PM
విమాన ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన విమానయాన సంస్థ సిబ్బందే బరితెగించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1లో ఓ పైలట్ ప్రయాణికుడిపై భౌతిక దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. క్యూ లైన్‌లో వెళ్తున్న సమయంలో తలెత్తిన చిన్న వివాదం కాస్తా రక్తపాతానికి దారితీసింది. బాధితుడు రక్తం కారుతుండగానే.. తనపై పైలెట్ దాడి చేశాడంటూ ఓ వీడియో తీసి నెట్టింట పెట్టాడు. ప్రస్తుతం ఇది కాస్తా వైరల్ కావడంతో.. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే?
బాధితుడు అంకిత్ దేవన్.. తన భార్య, ఇద్దరు చిన్న పిల్లలతో (ఏడేళ్ల కూతురు, నాలుగు నెలల పాప) కలిసి స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణించేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. చిన్న పాప స్ట్రోలర్‌లో ఉన్నందున.. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వారిని 'స్టాఫ్ సెక్యూరిటీ చెక్-ఇన్' లైన్ ఉపయోగించమని సూచించారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది క్యూ లైన్ పాటించకుండా ముందుకు వెళ్తుండటాన్ని అంకిత్ దేవన్ ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ కెప్టెన్ వీరేందర్ ఆగ్రహానికి గురయ్యారు.
అంకిత్‌ను ఉద్దేశించి "నువ్వేమైనా అన్పర్ (నిరక్షరాస్యుడివా)? ఇది స్టాఫ్ కోసం కేటాయించిన లైన్ అని బోర్డులు కనిపిండం లేదా?" అంటూ దుర్భాషలాడారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో పైలట్ ఒక్కసారిగా అంకిత్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో అంకిత్ ముఖంపై తీవ్రమైన గాయమై రక్తం కారింది. అక్కడే ఉండి ఇదంతా చూసిన అతడి భార్యా పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. "నా ఏడేళ్ల కూతురు కళ్ల ముందే ఈ దాడి జరిగింది. నా రక్తం చూసి ఆ చిన్నారి ఇప్పటికీ భయంతో వణికిపోతోంది" అని అంకిత్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. పైలట్ ధరించిన షర్ట్ మీద ఉన్న రక్తపు మరకలు కూడా తనవేనని ఆయన పేర్కొన్నారు.
అలాగే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే.. వారు కూడా తననే ఇబ్బంది పెట్టారని అంకిత్ ఆరోపించారు. ఫిర్యాదు చేస్తే ఫ్లైట్ మిస్ అవుతారని, లక్షల రూపాయల వెకేషన్ బుకింగ్స్ వృథా అవుతాయని భయపెట్టి.. తాను ఏమీ చేయనని లెటర్ రాయించుకున్నారని ఆయన వాపోయారు. "డబ్బులు పోగొట్టుకుంటేనే న్యాయం జరుగుతుందా? నేను తిరిగి వచ్చేలోపు సీసీటీవీ ఫుటేజీని మాయం చేస్తారా?" అని ఢిల్లీ పోలీసులను ఆయన నిలదీశారు. ఈ విషయాలను నెట్టింట పోస్ట్ చేసిన వీడియోలో ప్రస్తావించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. పైలట్ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఇంత అనాగరికంగా ప్రవర్తించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తీవ్రంగా స్పందించింది. తమ సంస్థ ఇలాంటి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేసింది. సదరు పైలట్‌ను తక్షణమే విధుల్లో నుంచి తొలగించి, విచారణకు ఆదేశించింది. అయితే ఆ సమయంలో పైలట్ డ్యూటీలో లేరని, మరో విమానంలో ప్రయాణికుడిగా వెళ్తున్నారని ఎయిర్‌లైన్ వివరణ ఇచ్చింది.
Latest News