|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 09:15 PM
పాకిస్థాన్ కోర్టు మరో సంచలన తీర్పును ఇచ్చింది. ముఖ్యంగా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీలకు స్థానిక కోర్టు శనివారం మరో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తాజా తీర్పు ఇమ్రాన్ మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌కు ఈ తీర్పు కోలుకోలేని దెబ్బగా మారింది.
'డెత్ సెల్'లో ఇమ్రాన్?.. కుటుంబ సభ్యుల ఆందోళన
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, జైలులో ఆయనకు అందుతున్న సౌకర్యాలపై ఆయన కుమారులు కాసిం ఖాన్, సులైమాన్ ఈసా ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా తన తండ్రిని ఏకాంత ఖైదులో ఉంచి మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఉన్న గది అత్యంత దారుణంగా ఉందని అన్నారు. అలాగే దానిని 'డెత్ సెల్'గా వారు అభివర్ణించారు. కనీసం తాగడానికి స్వచ్ఛమైన నీరు కూడా ఇవ్వడం లేదని, హెపటైటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న ఖైదీల మధ్య ఆయన్ని ఉంచారని వాపోయారు. తమ తండ్రి ప్రాణాలతో ఉన్నారనే దానికి సాక్ష్యం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ పట్ల పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అంతర్జాతీయ సమాజం కూడా తప్పుబడుతోంది. ఏకాంత ఖైదులో ఉన్న ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. జైలులో ఆయనకు సరైన వైద్య సదుపాయాలు, మానవ హక్కుల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాలని కోరింది. 73 ఏళ్ల వయస్సున్న ఇమ్రాన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ.. జైలు అధికారులు మాత్రం ఆయన క్షేమంగానే ఉన్నారని చెబుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అడియాలా జైలు యంత్రాంగం స్పష్టం చేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వివరించింది.
అలాగే పీటీఐ నాయకత్వానికి కూడా ఈ సమాచారాన్ని అందించామని జైలు అధికారులు తెలిపారు. ఇమ్రాన్‌ను మరో జైలుకు తరలిస్తున్నారనే వార్తల్లో కూడా నిజం లేదని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. 2023 ఆగస్టు నుంచి జైలులోనే గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఇప్పుడు మరిన్ని న్యాయపరమైన చిక్కులు ముసురుకున్నాయి. తాజా 17 ఏళ్ల శిక్షతో ఆయన రాజకీయ భవిష్యత్తు మరింత అంధకారంలో పడినట్లయింది. ఈ తీర్పు పాకిస్థాన్ ప్రభుత్వానికి, ప్రతిపక్ష పిటిఐ శ్రేణులకు మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది.