|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 09:35 PM
తిరుమలలోని ఓ విశ్రాంతిగృహంలో కోడిగుడ్లు బయటపడటం కలకలంరేపింది. ఓ భక్తుడు ఈ కోడిగుడ్లను తీసుకొచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం బయటపడటంతో కలకలం రేగింది. ఓ వైఎస్సార్‌సీపీ నేత శ్రీనివాస్ నాయక్ ఈ అంశంపై సోషల్ మీడియాలో వీడియో కూడా విడుదల చేశారు. ఈ నెల 17న తిరుమలలోని కౌస్తుభం భవనంలోని 538 గదిలో తాను గదిని తీసుకున్నానని.. ఆ గదిని శుభ్రం చేసిన పారిశుద్ధ్య కార్మికులు లోపలి నుంచి కోడిగుడ్లు ఉన్న కవర్ బయట పడేయడాన్ని గమనించానన్నారు. అయితే ఆ వీడియోలో ఆయన ఎలాంటి కోడిగుడ్లను మాత్రం చూపించలేదు. ఈ అంశంపై టీటీడీ కూడా స్పందించింది.. ఈ మేరకు ట్వీట్ చేసింది.
'తిరుమలలోని కౌస్తుభం వసతి గృహంలో 538వ గదిలోకి ఒక యాత్రికుడు నిషేధిత వస్తువులైన కోడి గుడ్లను తెచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అంశానికి సంబంధించి విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవం జరిగింది. అలాగే నిషేధిత వస్తువులైన కోడిగుడ్లను తీసుకొచ్చిన సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది' అని టీటీడీ తెలిపింది. భక్తులు ఫేక్ న్యూస్, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని నమ్మొద్దన్నారు. టీటీడీ అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలన్నారు. అయితే ఓ భక్తుడు కొండపైకి కోడిగుడ్లను ఎలా తీసుకొచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మూడు రోజుల క్రితం కూడా ఇద్దరు తమిళనాడు యువకులు తిరుమలలో రెచ్చిపోయారు. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన బ్యాానర్‌ను ప్రదర్శించారు.. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ అంశంపై కూడా టీటీడీ స్పందించింది. 'తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు శ్రీవారి ఆలయ పరిసరాల్లో రాజకీయ నాయకుల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీ బ్యానర్‌ను టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ప్రదర్శించినట్లు మా దృష్టికి వచ్చింది. ఆ బ్యానర్‌ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్ తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినట్లు తెలిసింది. సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ తెలియజేస్తోంది.' అని టీటీడీ ఒక ప్రకటనను విడుదల చేసింది.
Latest News