|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 01:20 PM
కేవలం 18 నెలల్లోనే రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ లో తమ పాలనపై ప్రజల నుంచి పాజిటివ్ అవుట్ పుట్ రావడం లేదన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఆయన తేల్చి చెప్పారు. అధికారం చేపట్టి 2 ఏళ్లు కాక ముందే ప్రజా విశ్వాసం కోల్పోయిన దేశంలో తొలి ప్రభుత్వం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఏ రోజు కా రోజు అప్పు- లేదంటే కొడుకు గురించి డప్పు కొట్టడమే 18 నెలలుగా చంద్రబాబు దినచర్యగా మారిందని ఆక్షేపించారు. రోజుకి సగటున రూ.500 కోట్లు చొప్పున ఇప్పటి వరకు చేసిన రూ.2.75 లక్షల కోట్లు అప్పు ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వాలు అప్పు చేస్తే ఆస్తి రూపంలో ఉండాలని, కాదంటే ప్రజల సంక్షేమంలో కనిపించాలన్న అమర్నాధ్... చంద్రబాబు పాలనలో అభివృద్ధి- ప్రజా సంక్షేమం రెండూ శూన్యమని స్పష్టీకరించారు. 50 శాతం ప్రజల అసంతృప్తే దీనికి నిదర్శనమన్నారు. మరోవైపు ప్రముఖ కంపెనీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం విశాఖలో భూదోపిడీకి పాల్పడుతుందని మండిపడ్డారు. టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి ఉద్యోగాలిచ్చే కంపెనీలకు 99 పైసలకే ఎకరా కేటాయించడం తప్పుకాదన్న అమర్నాధ్... అదే ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకూ భూసంతర్పణ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. విశాఖలో హిల్ నెంబరు 4లో ఎకరా రూ.30 నుంచి రూ.50 కోట్లు ఖరీదు చేసే భూమిని అత్యంత కారు చౌకగా ఎకరా రూ. 50 లక్షల నుంచి రూ.1 కోటికే కట్టబెట్టడమంటే... దోపిడీ కాక మరేంటని నిలదీశారు. ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కంచే చేను మేస్తే కాపాడేది ఎవరని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ దోపిడీపై ప్రజల తిరుగుబాటు ఖాయమని హెచ్చరించారు.
Latest News