|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:01 PM
పార్టీయే అందరికీ సుప్రీం అని, పార్టీ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తు.చ.తప్పకుండా పాటించాలని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.క్షేత్రస్థాయిలో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల అమలు తీరును జోనల్ కోఆర్డినేటర్లు నిరంతరం పర్యవేక్షించాలని లోకేశ్ సూచించారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అనుబంధ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా, మిగిలిన నామినేటెడ్ పదవులకు అర్హులైన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు.నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లలో సమస్యలు ఎంతవరకు పరిష్కారమవుతున్నాయో నివేదిక తయారు చేయాలని కోఆర్డినేటర్లను లోకేశ్ కోరారు. డీడీఆర్సీ సమావేశం జరిగే రోజే జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరుపుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాల నిర్మాణంపైనా ఇంఛార్జి మంత్రులతో చర్చించాలన్నారు.
Latest News