|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 07:15 PM
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఎన్నాళ్లుగానో కోరుతున్న మార్కాపురం జిల్లా ఏర్పాటుతో పాటుగా మదనపల్లె, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. రంపచోడవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటుగా 5 కొత్త రెవెన్యూ డివిజన్లు, ఓ మండలం కూడా ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రంపచోడవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుపై ఆ ప్రాంతంలోని కొన్ని వర్గాల నుంచి అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆదివాసీ గ్రామాల ప్రజలనుంచి ఈ నిర్ణయం మీద అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 22న మన్యం బంద్‌కు పిలుపునిచ్చారు.
పోలవరం జిల్లాలో ఆదివాసీ ప్రాంతాలు కూడా కలపాలని డిమాండ్ చేస్తూ పోలవరం ఆదివాసీ గ్రామాలు, ప్రజాసంఘాలు మన్యం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు సీపీఎం పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి మన్యం బంద్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ప్రకటించి, అందులో ఆదివాసీ గ్రామాలను కలపకపోవటంపై సీపీఎం పార్టీ అభ్యంతరం తెలుపుతోంది. పోలవరం జిల్లాను ప్రకటించి.. అందులో పోలవరం ఆదివాసీ గ్రామాలను కలపకపోవటం ఏమిటని ప్రశ్నిస్తోంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన ప్రజలు నిర్వాసితులు అవుతారని.. పోలవరం నిర్వాసితులకు జంగారెడ్డి గూడెం, కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాలలో పునరావస కల్పిస్తున్నారని సీపీఎం నేత రవి వెల్లడించారు. చింతూరు రెవెన్యూ డివిజన్ ప్రజలకు కూడా ఇక్కడే పునరావాసం కల్పిస్తున్నారని.. అలాంటి సమయంలో రంపచోడవరం జిల్లా కేంద్రంగా మాత్రమే ప్రత్యేక జిల్లాను ప్రకటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పోలవరం, రంపచోడవరం రెండు ప్రాంతాలను కలిపి జిల్లాను ఏర్పాటు చేయాలని.. అప్పుడేగిరిజన చట్టాల అమలుకు వీలవుతుందన్నారు. ఈ నేపథ్యంలో పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను కూడా కలపాలని డిమాండ్ చేస్తూ మన్యం బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చింతూరు డివిజన్‌లో చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, యెటపాక మండలాలు.. రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లో వైరామవరం. దేవీపట్నం, రంపచోడవరం, గుర్తేడు, గంగవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి.