|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 07:25 PM
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు (డిసెంబర్ 21) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్‌కు పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైసీపీ శ్రేణులతో పాటుగా ఇతర పార్టీల నేతలు, రాజకీయ నాయకులు వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల , తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి పొంగులేటి వంటి నేతలు వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినవారికి వైఎస్ జగన్ రిప్లై ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీసీసీ చీఫ్, సోదరి వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతోంది. "YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా." అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. షర్మిల ట్వీట్‌కు అమ్మా అంటూ వైఎస్ జగన్ రిప్లై ఇవ్వటం నెట్టింట వైరల్ అవుతోంది. థ్యాంక్యూ ఫర్ ద విషెస్ అమ్మా అంటూ వైఎస్ జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజనం పలు కామెంట్లు పెడుతున్నారు. రక్త సంబంధం అన్నింటి కంటే గొప్పందంటూ కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు గత కొంతకాలంగా వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య సత్సంబంధాలు లేని సంగతి తెలిసిందే. రాజకీయంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఇద్దరి మధ్య విభేదాలు బయటకు వచ్చాయి. ఆస్తి విషయంలో కోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఏపీసీసీ చీఫ్ అయిన తర్వాత వైసీపీ మీద, వైఎస్ జగన్ మీద షర్మిల విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి కూడా వైఎస్ షర్మిలకు రివర్స్ కౌంటర్లు మొదలయ్యాయి. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా షర్మిల శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం.. అందుకు జగన్ అమ్మా అంటూ రిప్లై ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Latest News