|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 08:15 PM
ఒకప్పుడు చిరిగిన జీన్స్‌తో పాటు కొన్ని రకాల దుస్తులు ధరించాలంటే సిగ్గుపడేవాళ్లు. వాటిని ధరించి బయటకు వెళ్లాలంటే.. ఏదోలా ఫీల్ అయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు కాలంతో పాటు ఫ్యాషన్ ట్రెండ్స్ కూడా మారిపోయాయి. ప్రస్తుతం, చిరిగిన జీన్స్ (Torn Jeans), స్లీవ్‌లెస్ దుస్తులు, బిగుతుగా ఉండే డ్రెస్సులు ధరించడం ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ తరం యువత ఇలాంటి వాటిని ధరిస్తూ తెగ మురిసిపోతున్నారు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం ఇలాంటి దుస్తులు ధరిస్తుండటంతో.. వీటికి క్రేజ్ మరీ పెరిగిపోయింది. అయితే కాలేజీ యువత మాత్రమే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులూ.. ఈ ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారట. ఉద్యోగుల తీరుపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి దుస్తులు వేసుకుని ఆఫీస్‌కు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
చిరిగిన జీన్స్.. అదే టాన్ జీన్స్‌తో పాటు స్లీవ్‌లెస్, బిగుతుగా ఉండే దుస్తులను ధరించి విధులకు హాజరు కావొద్దని ప్రభుత్వ ఉద్యోగులకు కర్ణాటక సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆఫీస్‌కు వచ్చే సమయంలో డీసెంట్ దుస్తులు మాత్రమే ధరించాలని చెప్పింది. ఈ మేరకు శనివారం (డిసెంబర్ 20) డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ (డీపీఎఆర్) విభాగం.. వివిధ శాఖల చీఫ్ సెక్రటరీలు, కమిషనర్లు, సీఎంవో, అదననపు ముఖ్య కార్యదర్శులు, జడ్పీ సీఈవోలకు ఉత్తర్వులు జారీ చేశారు.
యువ ప్రభుత్వ ఉద్యోగులు చిరిగిన జీన్స్, బిగుతైన దుస్తులతో విధులకు వస్తున్నారని, ఇది అసభ్యకరంగా కనిపిస్తోందని ఇటీవల ఓ అధికారి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అభ్యంతరకర దుస్తులు ధరించి విధులకు హాజరవుతున్నారనే విమర్శలు వస్తున్నాయని కర్ణాటక సర్కార్ కూడా చెబుతోంది. అందుకే విధి నిర్వహణలో హుందాగా కనిపించేలా దుస్తులు ధరించాలని గతంలోనే సూచనలు చేసినట్లు చెప్పింది. అయినా ఉద్యోగులెవరూ పట్టించుకోకపోవడంతో ఈసారి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తున్నామని పేర్కొంది. కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎస్ షడాక్షరి స్వాగతించారు.
చిరిగిన జీన్స్ వేసుకుంటే జైలు శిక్ష!
మరోవైపు, కొన్ని దేశాల్లో చిరిగిన జీన్స్ ధరించకుండా కఠినమైన చట్టాలు ఉన్నాయి. చిరిగిన జీన్స్ వేసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అందులో ఇరాన్, సౌదీ అరేబియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ వంటి దేశాల్లో పౌరులు ధరించే దుస్తులపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి చిరిగిన జీన్స్ వేసుకుంటే ఇరాన్‌లో జైలు శిక్ష జరిమానా పడొచ్చు. సౌదీలో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి జీన్స్ ధరించకూడదు. అలాగే తాలిబాన్ల రాజ్యంలో చిరిగిన జీన్స్ నిషేధం. పాకిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో మతపరమైన సంస్థలు ఇలాంటి వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తాయి.
Latest News