|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:52 PM
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారీగా విరాళాలు అందాయి. ఫార్మా, పునరుత్పాదక ఇంధన (సోలార్), రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలతో పాటు పలువురు వ్యక్తులు ఈ పార్టీలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చారు. 2024 జూన్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పార్టీలు తమ విరాళాల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాయి. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఈ వివరాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీకి 2024-25లో మొత్తం రూ.83.03 కోట్ల విరాళాలు అందాయి. గతేడాది వచ్చిన రూ.100.18 కోట్లతో పోలిస్తే ఇది రూ.17.15 కోట్లు తక్కువ. ఈ నిధులలో రూ.38 కోట్లను పేదల ఆరోగ్య పథకం వంటి కార్యక్రమాలకు కేటాయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. "మాకు అందిన ప్రతీ రూపాయికి జవాబుదారీగా ఉంటాం" అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ.25.33 కోట్ల విరాళాలు అందాయి. పార్టీకి ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి ఎలాంటి నిధులు అందకపోవడం గమనార్హం. జనసేనకు వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు అందాయి. హైదరాబాద్ షాద్‌నగర్‌కు చెందిన రవికుమార్ ఆకుల అత్యధికంగా రూ.5 కోట్లు విరాళం ఇచ్చారు.హైదరాబాద్‌కు చెందిన ఆర్వీఎం కన్‌స్ట్రక్షన్స్ రూ.3 కోట్లు, డీవీకే కన్‌స్ట్రక్షన్స్ రూ.2 కోట్లు, నాట్కో ఫార్మా రూ.1 కోటి, ఉద్దరాజు శ్రీరామ లక్ష్మీపతి భోగరాజు రూ.1 కోటి చొప్పున విరాళాలు అందించారు. "రూ.10, రూ.20 ఇచ్చే చిన్న దాతలు, పెన్షనర్లు, పార్టీ కార్యకర్తల మద్దతు మరువలేనిది" అని జనసేన అధికార ప్రతినిధి అజయ్ కుమార్ వేములపాటి కృతజ్ఞతలు తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి ఏకంగా రూ. 6,088 కోట్ల విరాళాలు అందాయి. అంతకుముందు ఏడాదితో (రూ. 3,967 కోట్లు) పోలిస్తే ఇది 53 శాతం అధికం. గత ఆరేళ్లలో బీజేపీకి ఇదే అత్యధిక విరాళాల సేకరణ కావడం గమనార్హం. బీజేపీకి అందిన విరాళాలు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు వచ్చిన నిధుల (రూ. 522.13 కోట్లు) కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువ. డజనుకు పైగా ప్రతిపక్ష పార్టీలకు అందిన మొత్తం విరాళాలతో పోల్చినా, బీజేపీకి వచ్చిన నిధులు 4.5 రెట్లు అధికంగా ఉన్నాయి.ఎలక్టోరల్ బాండ్ల స్థానంలో ఇప్పుడు ఎలక్టోరల్ ట్రస్టులు కీలక నిధుల సమీకరణ మార్గంగా మారాయి. బీజేపీకి అందిన మొత్తం విరాళాల్లో 61 శాతం, అంటే రూ. 3,744 కోట్లు ఈ ట్రస్టుల ద్వారానే వచ్చాయి.
Latest News