|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 07:31 PM
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానాన్ని వ్యాపారంలా చూడకుండా, ఆరోగ్యకరమైన వృద్ధి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని సూచించారు. మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, రిటైలర్ మార్జిన్ పెంపు వంటి అంశాలపై మరింత కసరత్తు చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. బార్ ఏఆర్ఈటీ (అడిషనల్ రిటెయిల్ ఎక్సైజ్ టాక్స్) మినహాయింపు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలించాలని నిర్దేశించారు.
అక్రమ మద్యాన్ని అరికట్టడంతో పాటుగా.. బెల్టు షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటుగా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో కొత్త ఎక్సైజ్ విధానాల అమలు, వాటి ప్రభావంపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా బెల్టు షాపులపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. బెల్టు షాపుల కట్టడికి హరియాణా మోడల్ అనుసరించాలని సూచించారు. హరియాణాలో సబ్ లీజ్ విధానం అమలవుతోంది. ఈ నేపథ్యంలో హరియాణా తరహాలో సబ్ లీజ్ విధానాన్ని అధ్యయనం చేయాలని చంద్రబాబు ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు.
మరోవైపు చంద్రబాబుతో సమీక్ష సందర్భంగా అధికారులు పలు విషయాలను ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం షాపులు లేకపోవటంతోనే బెల్టు షాపులు ఏర్పాటవుతున్నాయని వివరించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా లిక్కర్ బాటిల్‌ను వాడేసిన అనంతరం తిరిగి ఇచ్చిన వారికి డిపాజిట్ రిటర్న్ స్కీమ్ కింద నగదు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
మరోవైపు ఏపీలో మద్యం విక్రయాలు పెరిగాయి. ఈ విషయాన్ని సీఎంతో సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. 2024 అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి 2025 అక్టోబర్ వరకూ 8 వేలకోట్ల ఎక్సైజ్ ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంటే.. రూ.7041 కోట్లు వచ్చినట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 17 వరకూ మద్యం విక్రయాలు 4.52 శాతం వరకూ పెరిగాయని వివరించారు. ఈ సందర్భంగా నకిలీ మద్యానికి ఆస్కారం లేకుండా ప్రతి లిక్కర్ బాటిల్ మీద కూడా ప్రత్యేక లిక్కర్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
Latest News