ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మారేలా.. 2025లో వేసిన బలమైన అడుగులు ఇవే.
 

by Suryaa Desk | Mon, Dec 22, 2025, 07:40 PM

2025 సంవత్సరం పూర్తి కావొస్తోంది. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. మరి ఈ ఏడాది ఎలా జరిగింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా ఎలాంటి అడుగులు పడ్డాయి.. నవ్యాంధ్రలో నవ శకానికి ప్రారంభంగా ఎలాంటి భారీ ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయి.. దీని వలన రాష్ట్ర యువతకు ఎంత మేరకు ఉపయోగమనే విషయాలను ఓసారి రివైండ్ చేసుకుంటే.. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా ఈ 2025 ఏడాదిలో బలమైన అడుగులు వేసింది. రేపటి కోసం నేటి నుంచే కార్యాచరణ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి పరంగా 2025 ఓ మైలురాయిగా నిలిచింది.


అమరావతి


ఏపీ అంటే ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం.. ఇదీ సీఎం కాగానే చంద్రబాబు చెప్పిన నిర్వచనం. ఇందుకు అనుగుణంగానే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే 2025లోనే బలమైన అడుగులు పడ్డాయి. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. అమరావతిలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతోంది. ఇందులో భాగంగా సెక్రటేరియట్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, ట్రంక్ రోడ్లు, రిజర్వాయర్లు వంటి ముఖ్య నిర్మాణాలను వేగంగా జరుపుతోంది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచబ్యాంక్‌తో పాటుగా వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటూ పనుల్లో వేగం పెంచింది. అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు వంటి నిర్మాణాలు తలపెట్టిన ఏపీ ప్రభుత్వం.. రెండో విడత భూసమీకరణ కింద మరో 16 వేల ఎకరాలుసమీకరించాలని నిర్ణయించింది.


మరోవైపు అమరావతిలో ప్రతిష్టాత్మక క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్రం కేటాయించిన నిధులతో దేశంలోనే మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు.


విశాఖలో గూగుల్ డేటా సెంటర్


విశాఖను ఏఐ సిటీగా మార్చాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం..ఆ దిశగా 2025లో బలంగా అడుగులు వేసింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటం వైజాగ్ ముఖ చిత్రాన్ని మార్చనుంది. గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. విశాఖలో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారుగా లక్షన్నర కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు విశాఖను ఏఐ హబ్‌గా మారుస్తుందని ప్రభుత్వం చెప్తోంది.


ఏపీ గ్రోత్ ఇంజన్.. విశాఖ భాగస్వామ్య సదస్సు


మరోవైపు విశాఖ వేదికగా జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కూడా ఏపీ గ్రోత్ ఇంజన్‌గా మారనుంది. ఈ సదస్సులో సుమారుగా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. 640 అవగాహన ఒప్పందాల ద్వారా రూ. 13.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అంచనా.


రిలయన్స్ ఏఐ డేటా సెంటర్


మరోవైపు రిలయన్స్ సంస్థ కూడా విశాఖలో ఏఐ డేటా సెంటర్ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రూ. 93,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. అలాగే 6 గిగావాట్ల సోలార్ ప్రాజెక్టు, రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. అలాగే అదానీ గ్రూప్, బ్రూక్ ఫీల్డ్, రీన్యూ వంటి సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.


టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్


మరోవైపు డేటా సెంటర్లతో పాటుగా ఐటీ సంస్థలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా విశాఖ మారుతోంది. విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. క్యాంపస్ ఏర్పాటు కోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అలాగే టీసీఎస్, యాక్సెంచర్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా విశాఖలో క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. ఆ రకంగా సాగరతీరాన్ని ఐటీ హబ్‌గా మార్చేలా బలమైన అడుగులు ఈ ఏడాదిలో పడ్డాయి.


బీపీసీఎల్ రిఫైనరీ.. ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్లాంట్


మరోవైపు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం వద్ద రూ.96 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కూడా 2025లోనే అడుగులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ బీపీసీఎల్ రామాయపట్నం పోర్టు వద్ద ఆయిల్ రిఫైనరీతో పాటుగా పెట్రో కెమికల్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇక అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటు కూడా ఏపీ ఆర్థికవ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలకంగా మారనున్నాయి.


ఏవియేషన్ ఎడ్యుసిటీ


విశాఖపట్నం, విజయనగరం సరిహద్దులలో 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యు సిటీ నిర్మాణానికి కూడా ఈ ఏడాదిలో అడుగులు పడ్డాయి. 136 ఎకరాల్లో జీఎంఆర్ గ్రూప్- మాన్సాస్ ట్రస్టు కలిసి ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీని ఏర్పాటు చేయనున్నాయి. ఇది పూర్తి అయితే ఏవియేషన్ రంగంలో అంతర్జాతీయ స్థాయి నిపుణులను తయారు చేయటమే కాకుండా.. ఏపీని విమానయాన శిక్షణలో గ్లోబల్ సెంటర్‍గా మార్చుతుందని అధికారులు చెప్తున్నారు.


భోగాపురం ఎయిర్‌పోర్టు


ఇక అన్నింటికంటే ప్రధానంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి. 2026 మే నెలలో భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది. ఈ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రం మారుతుందని నిపుణులు చెప్తున్నారు.


పెట్టుబడుల జాతర


మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశాల్లో 2025 ఏడాదిలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 13 ఎస్ఐ‌పీబీ సమావేశాలు జరగ్గా..మొత్తం రూ.8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఈ సమావేశాల్లో ఆమోదం లభించింది.ఈ పెట్టుబడుల ద్వారా 7.62 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి 2025 బలమైన అడుగులు పడ్డాయి.


Latest News
SC to hold crucial suo motu hearing on Aravalli definition today Mon, Dec 29, 2025, 10:37 AM
NZ allrounder Doug Bracewell retires from all forms of cricket Mon, Dec 29, 2025, 10:33 AM
Ashes: Atkinson ruled out of SCG Test with hamstring injury Mon, Dec 29, 2025, 10:30 AM
Dense fog disrupts flights across India, passengers face delays and diversions Mon, Dec 29, 2025, 10:25 AM
Night temperature rises above freezing point throughout Kashmir Valley save Gulmarg Mon, Dec 29, 2025, 10:22 AM