|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 07:46 PM
సోమవారం రోజు అనంతపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనంతపురం శివారు ప్రాంతంలో సోమవారం కాల్పుల కలకలం సంచలనం రేపింది. ఓ నిందితుణ్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన సీఐపై.. నిందితుడు కత్తితో దాడి చేశాడు. దీంతో సీఐ రివాల్వర్‌తో కాల్పులు జరపటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని విద్యుత్ నగర్ వద్ద ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. దేవరకొండ అజయ్, రాజా అనే ఇద్దరు ఆదివారం రాత్రి విద్యుత్ నగర్ వద్ద కలుసుకున్నారు. అక్కడే మద్యం సేవించారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి కొట్టుకునే వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే మద్యం మత్తులో దేవరకొండ అజయ్.. రాజా మీద కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో గాయపడిన రాజా అనంతపురం టూ టౌన్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. రాజా ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అనంతపురం టూటౌన్ పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే సీఐ శ్రీకాంత్.. దేవరకొండ అజయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే అనంతపురం శివారు ప్రాంతమైన ఆకుతోటపల్లి వద్ద అజయ్ ఉన్నట్లు సీఐ శ్రీకాంత్‌కు సమాచారం అందింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు సీఐ శ్రీకాంత్ ఆకుతోటపల్లి వెళ్లారు. అజయ్ వద్దకు చేరుకున్న సీఐ.. లొంగిపోవాలని సూచించారు. అయితే అజయ్ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే సీఐ శ్రీకాంత్ మీద కత్తితో దాడి చేశాడు.
ఘటనలో సీఐ శ్రీకాంత్ చేతికి గాయం కాగా.. సీఐ శ్రీకాంత్ రివాల్వర్‌తో అజయ్ మోకాలిపై కాల్చారు. అనంతరం అజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆత్మరక్షణ కోసమే అజయ్‌పై కాల్పులు జరిపినట్లు అనంతపురం టూ టౌన్ సీఐ శ్రీకాంత్ వెల్లడించారు.
అజయ్ వేర్వేరు సందర్భాల్లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేశారన్న సీఐ.. అజయ్ ఆకుతోటపల్లి వద్ద ఉన్నాడన్న సమాచారంతో అక్కడకు చేరుకున్నట్లు తెలిపారు. అయితే అజయ్ తనపై ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడని.. ప్రాణ రక్షణ కోసం కాల్పులు జరిపి.. అజయ్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Latest News