|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 07:51 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని పర్మినెంట్‌గా అధికారానికి దూరం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ మంగళగిరిలో నిర్వహించిన పదవి- బాధ్యత కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తనకు ఎవరూ శత్రువులు కాదన్న పవన్ కళ్యాణ్.. విధానాలతోనే తనకు సమస్య అని అన్నారు. ఆకు రౌడీలను ప్రోత్సహించే పార్టీని గుర్తించనన్న పవన్ కళ్యాణ్.. విధానాలపై ప్రశ్నిస్తే ప్రోత్సహిస్తానన్నారు. అలాగే అరాచకాలు మితిమీరి ఇక తప్పదని అనుకుంటే ఆఖరి అస్త్రంగా షర్ట్ మడతపెడతామంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
వైసీపీ దాడులకు భయపడేది లేదన్న పవన్ కళ్యాణ్.. ఆ పార్టీ ఓ రౌడీ సమూహంలా కనిపిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. రౌడీలను ప్రోత్సహించే పార్టీని.. పార్టీలా కాకుండా రౌడీ గ్యాంగ్‌గానే చూస్తామని అన్నారు. మహిళలను కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని.. తాము అధికారంలోకి వస్తే అంతుచూస్తామని హెచ్చరిస్తున్నారని అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. వైసీపీ నేతలు బెదిరించడం మానుకోవాలన్న పవన్ కళ్యాణ్..లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. అలా కాదని ఇలాగే మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఘాటు వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు వైసీపీ నేతలు మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారని.. అలాంటి మాటలను ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు నమ్మవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని.. వైఎస్ జగన్ అండ్ కో మళ్లీ అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ పర్మినెంట్‌గా అధికారంలోకి రాకుండా చూస్తామంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశ సమగ్రతకు భంగం వాటిళ్లకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. మరోవైపు ఏ పదవి అయినా బాధ్యతగా వ్యవహరించాలని జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ సూచించారు. అధికారం ఉందనే అహంకారంతో వ్యవహరించవద్దని అన్నారు.