|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 08:57 PM
శబరిమల గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ జరపాలన్న కేరళ ప్రభుత్వ ప్రయత్నాలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పినరయి విజయన్ ప్రభుత్వం జారీ చేసిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. తిరువల్లకు చెందిన అయానా చారిటబుల్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కేరళ హైకోర్టు జస్టిస్ సి. జయచంద్రన్ ఈ కీలక తీర్పును వెలువరించారు. అవసరానికి మించి.. భూ సేకరణ చేస్తున్నట్లు గుర్తించిన హైకోర్టు.. ఆ ప్రక్రియను రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అంత భూమి ఎందుకని.. విచారణ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది.
భూసేకరణ చట్టం 2013 ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన కనిష్ట భూమిని మాత్రమే సేకరించాలని కోర్టు తెలిపింది. ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం కేరళ ప్రభుత్వం.. 2,570 ఎకరాలు సేకరించాలని భావించగా.. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం భారీ విమానాలైన బోయింగ్ 777 వంటి వాటి కోసం 1,200 ఎకరాలు సరిపోతాయని పేర్కొంది. సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఎస్ఐఏ), నిపుణుల కమిటీ నివేదికల్లో.. భవిష్యత్తు అవసరాల కోసం ఇంత భారీ భూమి ఎందుకు అవసరమో సరైన వివరణలు లేవని హైకోర్టు గుర్తించింది.
కొచ్చి ఎయిర్‌పోర్టు (1,300 ఎకరాలు).. తిరువనంతపురం విమానాశ్రయం (700 ఎకరాలు), కోజికోడ్ ఎయిర్‌పోర్టు (373 ఎకరాలు) వంటి విమానాశ్రయాల విస్తీర్ణంతో పోల్చితే.. శబరిమల ఎయిర్‌పోర్టు కోసం ప్రతిపాదించిన భూమి చాలా ఎక్కువ అని ధర్మాసనం పోల్చి చూసి అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు కావడంతో.. కేరళ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను మళ్లీ ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎయిర్‌పోర్టులు, డ్యామ్‌ల వంటి ప్రాజెక్టులపై అవగాహన ఉన్న సాంకేతిక నిపుణులతో కొత్తగా ఎస్ఐఏ రిపోర్టు తయారు చేయాల్సి ఉంది. ఆ కొత్త నివేదికను నిపుణుల బృందం సమీక్షించి.. కేరళ ప్రభుత్వం దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కచ్చితంగా చట్టంలోని నిబంధనలకు లోబడి.. కేవలం అవసరమైన భూమిని మాత్రమే సేకరించాలని కేరళ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
శబరిమల ఎయిర్‌పోర్టుకు సంబంధించి.. భూ సేకరణ నోటిఫికేషన్‌ను కేరళ హైకోర్టు రద్దు చేయడంతో.. విమానాశ్రయ ప్రాజెక్టు మరింత జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేరళ ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిపుణుల కమిటీని నియమించి.. వాస్తవ అవసరాలకు అనుగుణంగా నివేదికలను సిద్ధం చేయాల్సి ఉండటంతో శబరిమలకు వెళ్లే భక్తులకు విమానాలు అందుబాటులోకి రావడం మరింత ఆలస్యం కానుంది.
Latest News