|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 09:15 PM
నేషనల్ హెరాల్డ్ కేసులో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను విచారణకు స్వీకరించడానికి ట్రయల్ కోర్టు నిరాకరించడాన్నిసవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు.. సోమవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసింది.ఈ అంశంపై తమ వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
ఈ కేసులో దర్యాప్తు పూర్తి అయిందని.. అనేక సోదాలు నిర్వహించి పక్కా ఆధారాలు సేకరించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. సోనియా, రాహుల్‌పై ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం పొరపాటు అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకుని.. ఈడీ ఫిర్యాదును విచారణకు స్వీకరించాలని కోరారు. అయితే ఈడీ ఛార్జిషీట్‌కు సంబంధించి.. గత వారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో గాంధీ కుటుంబానికి భారీ ఊరట లభించినట్లయింది. ఈ ఫిర్యాదు నిలవదగినది కాదని.. ఇక ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నే కొట్టిపారేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ వెంటనే హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చింది.
అసలు ఆరోపణలు ఏంటి?
నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన ఆస్తులను నిందితులు అక్రమంగా దక్కించుకున్నారని ఈడీ ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. కేవలం రూ. 90 కోట్ల రుణాన్ని సాకుగా చూపించి.. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా అక్రమంగా లాక్కున్నారని ఈడీ పేర్కొంది. యంగ్ ఇండియన్ కంపెనీ సంస్థలో సోనియా, రాహుల్ గాంధీలకు 76 శాతం వాటా ఉంది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు సామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి నేతలను కూడా ఈడీ నిందితులుగా చేర్చింది.
రాజకీయ విమర్శలు - ప్రతివిమర్శలు
ఈ కేసులో ఒక్క రూపాయి కూడా చేతులు మారలేదని.. ఆస్తులన్నీ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ వద్దే ఉన్నాయని సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. బీజేపీ కేవలం రాజకీయ కక్షతోనే విషయాన్ని పెద్దది చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. గాంధీ కుటుంబానికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని.. వారిపై బోలెడన్ని ఆధారాలు ఉన్నాయని బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు.
Latest News