|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:03 PM
ఏపీలో న్యాయవాదులకు ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదుల సంక్షేమ కమిటీ గుడ్‌న్యూస్ చెప్పింది. లాయర్లకు మరణానంతర ప్రయోజనాలు, వైద్య ఖర్చులు, పదవీ విరమణ ప్రయోజనాల కింద ఆర్థిక సాయం అందించేందుకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని, మొత్తం రూ.5.60 కోట్లకు పైగా నిధులను న్యాయవాదులు మరియు వారి కుటుంబాలకు మంజూరు చేసింది.ఈ సమావేశంలో హైకోర్టు, ఏపీ న్యాయశాఖ ప్రతినిధులతో పాటు ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, పి. నరసింగరావు పాల్గొన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఒక్కొక్కటిగా పరిశీలించి, ఆమోదం తెలిపారు.మరణానంతర ప్రయోజనాల కింద 54 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ.3.51 కోట్లను మంజూరు చేశారు. అలాగే, తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందిన 137 మంది న్యాయవాదులకు వైద్య ఖర్చుల కోసం రూ.1.90 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. పదవీ విరమణ ప్రయోజనాల కింద ఏడుగురు న్యాయవాదులకు రూ.19.20 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని కలిపి మొత్తం రూ.5,60,80,000 నిధులు న్యాయవాదులు మరియు వారి కుటుంబాలకు అందనున్నాయి.
Latest News