|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:05 PM
భారత్, న్యూజిలాండ్ మధ్య ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై న్యూజిలాండ్ ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఇది ‘స్వేచ్ఛాయుతమైనది కాదు.. నిష్పాక్షికమైనది అసలే కాదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది న్యూజిలాండ్‌కు తీవ్ర నష్టం చేకూర్చే ‘బ్యాడ్ డీల్’ అని ఆయన అభివర్ణించారు.న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీ అధినేతగా, సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పీటర్స్ ఈ ఒప్పందంపై ఎక్స్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధాన ఎగుమతి రంగమైన డెయిరీ (పాలు, వెన్న, చీజ్) ఉత్పత్తులపై భారత్ ఎటువంటి సుంకాలు తగ్గించలేదని, దీనివల్ల తమ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. డైరీ ఉత్పత్తులు లేని మొదటి వాణిజ్య ఒప్పందం ఇదేనని మండిపడ్డారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ కార్మికులు, విద్యార్థుల వలసలకు న్యూజిలాండ్ భారీగా రాయితీలు ఇచ్చిందని, ఇది తమ దేశ నిరుద్యోగులపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.
Latest News